చరిత్ర సృష్టించిన సుయాశ్‌ శర్మ | IPL 2026: Suyash Sharma Leaves Legends Behind With Historic IPL Record | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన సుయాశ్‌ శర్మ

Apr 28 2026 5:24 PM | Updated on Apr 28 2026 5:31 PM

IPL 2026: Suyash Sharma Leaves Legends Behind With Historic IPL Record

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 27) జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఆర్సీబీ 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసిన ఆర్సీబీ ప్రత్యర్దిని 16.3 ఓవర్లలో 75 పరుగులకే కుప్పకూల్చింది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని వికెట్‌ మాత్రమే కోల్పోయి ఆడుతూపాడుతూ ఛేదించింది.

ఢిల్లీని 75 పరుగులకు కట్టడి చేయడంలో ఆర్సీబీ బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌ (3-0-5-3), హాజిల్‌వుడ్‌ (3.3-0-12-4), రసిక్‌ సలాం దార్‌ (2-0-21-1), సుయాశ్‌ శర్మ (4-1-7-1), కృనాల్‌ పాండ్యా (2-0-9-1) కీలకపాత్ర పోషించారు. వీరిలో భువీ, హాజిల్‌వుడ్‌ ఆరంభంలో చెలరేగగా.. ఆతర్వాత సుయాశ్‌ శర్మ పేట్రేగిపోయాడు. ఈ క్రమంలో సుయాశ్‌ చారిత్రక ప్రదర్శన నమోదు చేశాడు.

తన కోటా 4 ఓవర్లలో కేవలం 7 పరుగులే ఇచ్చిన సుయాశ్‌, ఓ వికెట్ కూడా పడగొట్టాడు. అంతేకాదు, తన స్పెల్‌లో ఏకంగా 20 డాట్ బాల్స్ వేశాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో సంయుక్తంగా అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్‌గా అతడిని నిలిపింది. 

ఈ ఘనతను ఇంతకుముందు దీపక్‌ చాహర్‌ సాధించాడు. చాహర్‌ 2019 ఎడిషన్‌లో సీఎస్‌కేకు ఆడుతూ కేకేఆర్‌పై ఈ చారిత్రక గణాంకాలు నమోదు చేశాడు. ఇక్కడ దీపక్‌ చాహర్‌ పేస్‌ బౌలర్‌ కాగా.. ఈ ఘనత సాధించిన తొలి స్పిన్నర్‌గా సుయాశ్‌ చరిత్ర సృష్టించాడు. ఈ రికార్డుకు సంబంధించి టాప​-5 బౌలర్లలో సుయాశ్‌ ఒక్కడే స్పిన్నర్‌గా ఉన్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక డాట్‌ బాల్స్‌ వేసిన బౌలర్లు (టాప్‌-5)
సుయాశ్‌ శర్మ- 20
దీపక్‌ చాహర్‌- 20
ఫిడేల్‌ ఎడ్వర్డ్స్‌- 19
జహీర్‌ ఖాన్‌- 19
మహ్మద్‌ షమీ- 19

కాగా, ఈ చారిత్రక ప్రదర్శనలో సుయాశ్‌ ఇచ్చిన 7 పరుగుల్లో 3 వైడ్ల రూపంలో వచ్చాయి. ఇవి కూడా వేయకపోయుంటే సుయాశ్‌ ఐపీఎల్‌లో అత్యంత​ పొదుపైన స్పెల్‌ వేసిన బౌలర్‌గానూ రికార్డుల్లోకెక్కేవాడు. ఈ మ్యాచ్‌లో సుయాశ్‌ మధ్య ఓవర్లలో పరుగులకు పూర్తిగా అడ్డుకట్ట వేశాడు. అతని కట్టుదిట్టమైన బౌలింగ్ ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించింది.

ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకగా.. ఢిల్లీ ఏడో స్థానానికి పడిపోయింది. ఆర్సీబీ ఏప్రిల్‌ 30న జరుగబోయే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో తలపడనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement