శార్దూల్ ఠాకూర్ (PC: BCCI)
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడు ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి బ్యాటింగ్ కానీ, బౌలింగ్ కాని చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.
ఈ చారిత్రక ఘటనలో పాత్రధారుడు ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్. 2026 ఎడిషన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శార్దూల్ ముంబై బౌలింగ్ సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి ఒక్క బంతి కూడా వేయలేదు.
244 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో ముంబై సారధి హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్ 7వ ఓవర్ సమయంలో శార్దూల్‌ను ఇంపాక్ట్ ప్లేయర్‌గా (బౌలర్) తీసుకున్నాడు. అయితే మ్యాచ్ పూర్తయ్యే వరకు హార్దిక్ శార్దూల్‌తో ఒక్క బంతి కూడా వేయించకపోవడం తీవ్ర చర్చకు దారి తీసింది.
ఐపీఎల్ చరిత్రలో ఇంపాక్ట్ సబ్‌గా వచ్చి, ఏ విభాగంలోనూ పాల్గొనని తొలి ఆటగాడిగా శార్దూల్ చరిత్ర సృష్టించాడు. ఈ చారిత్రక తప్పిదం చేసినందుకు హార్దిక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెగ్యులర్ బౌలర్లు ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్న వేల, ఇంపాక్ట్ ప్లేయర్‌గా శార్దూల్‌ను బరిలోకి దించి బౌలింగ్ చేయించకపోవడమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఈ అంశాన్ని వూహ్యాత్మక తప్పిదంగా విశ్లేషిస్తూ హార్దిక్‌పై మండిపడుతున్నారు. ముంబై బ్యాటింగ్ కోచ్ పోలార్డ్ కూడా ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "శార్దూల్‌తో ఒక్క ఓవర్ కూడా వేయించలేదు.. నేను వెళ్లి కారణం అడుగుతాను" అంటూ వ్యాఖ్యానించాడు.
ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 244 పరుగుల భారీ స్కోర్‌ను కూడా కాపాడుకోలేక చేతులెత్తేసింది. సన్‌రైజర్స్ బ్యాటర్లు ప్రతి ముంబై బౌలర్‌ను చీల్చిచెండాడి పరుగులు పిండుకున్నారు. ఫలితంగా సన్‌రైజర్స్ 244 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలుండగానే ఊదేసింది.
ఈ ఓటమితో ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో కేవలం రెండే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది.


