క్వాలిఫయర్‌-1 పోరు.. ఫైనల్‌ అడుగు ఎవరిది? | IPL 2026: RCB Vs Gujarat Titans Qualifier-1 Fight-Who-Will-Reach Final | Sakshi
Sakshi News home page

IPL 2026: క్వాలిఫయర్‌-1 పోరు.. ఫైనల్‌ అడుగు ఎవరిది?

May 26 2026 7:01 AM | Updated on May 26 2026 8:37 AM

IPL 2026: RCB Vs Gujarat Titans Qualifier-1 Fight-Who-Will-Reach Final

ఐపీఎల్‌లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్, మాజీ చాంపియన్‌ జట్లు మరో టైటిల్‌ వేటలో ముందుగా ఫైనల్లోకి అడుగు పెట్టేందుకు సై అంటున్నాయి. చెరో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బెంగళూరు, గుజరాత్‌ టీమ్‌ల మధ్య మ్యాచ్‌ తొలి క్వాలిఫయర్‌ విజేత నేరుగా తుది పోరుకు అర్హత సాధించే అవకాశం  ఉండగా... ఓడిన జట్టు నిష్క్రమించకుండా రెండో క్వాలిఫయర్‌లో మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ ఏడాది లీగ్‌ దశ రెండు ముఖాముఖి మ్యాచ్‌ల్లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి.  

ధర్మశాల: డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) మరోసారి క్వాలిఫయర్‌–1 ద్వారా నేరుగా ఫైనల్‌కు చేరుతుందా? గత సీజన్‌లో ఎలిమినేటర్‌లో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న గుజరాత్‌ టైటాన్స్‌ మూడేళ్ల తర్వాత మరోసారి తుది పోరుకు అర్హత సాధిస్తుందా? ఈ రెండు మేటి జట్ల మధ్య మరికొన్ని గంటల్లో జరిగే సమరంలో పైచేయి ఎవరిదో తేలనుంది. 

టోర్నీ ఆసాంతం బెంగళూరు కీలక సమరాల్లో ఆధిక్యాన్ని అందుకొని ముందంజ వేయగా... రెండో అర్ధ భాగంలో అసాధారణంగా రాణించి గుజరాత్‌ దూసుకొచ్చింది. ఐపీఎల్‌లో ఇరు జట్లు ‘ప్లే ఆఫ్స్‌’లో తలపడటం ఇదే మొదటిసారి కావడం విశేషం కాగా... ఓవరాల్‌గా ముఖాముఖి పోరులో రెండు జట్లు 4–4తో సమానంగా ఉన్నాయి.  

ఆద్యంతం నిలకడగా..
వరుసగా రెండో సీజన్‌లో టాప్‌–2తో ముగించడం బెంగళూరు నిలకడను చూపిస్తోంది. టోర్నీ తొలి అర్ధభాగంలో ఐదు మ్యాచ్‌లు గెలిచిన జట్టు రెండో అర్ధభాగంలో నాలుగు విజయాలు సాధించింది. ఈ సీజన్‌లో అతి తక్కువ మంది ఆటగాళ్లను ఉపయోగించిన జట్టుగా ఆర్‌సీబీ నిలిచింది. అంటే టీమ్‌ ఎంత స్థిరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో కీలక ఆటగాళ్లంతా సత్తా చాటారు. వరుసగా నాలుగో సీజన్‌లో 500కు పైగా పరుగులు సాధించిన విరాట్‌ కోహ్లి (557) ముందుండి నడిపించగా... పడిక్కల్‌ (433), పాటీదార్‌ (393) తమ వంతు పాత్ర పోషించారు. ఒక సెంచరీ, 4 అర్ధసెంచరీలతో చెలరేగుతున్న కోహ్లిని తాజా ఫామ్‌లో నిలువరించడం అంత సులువు కాదు. బౌలింగ్‌లో భువనేశ్వర్‌ (24 వికెట్లు) టోరీ్నలో ఆర్‌సీబీకి విజయాలు అందిస్తూ అగ్ర స్థానంలో నిలిచాడు. 

హాజల్‌వుడ్, రసిఖ్‌ సలామ్‌లనుంచి అతనికి సరైన సహకారం లభించింది. ఇక ఆల్‌రౌండర్‌గా కృనాల్‌ పాండ్యా రాణిస్తున్నాడు. భిన్నమైన బౌలింగ్‌ శైలితో ప్రత్యర్థి బ్యాటర్లను నిలువరిస్తున్న అతను... బ్యాటింగ్‌లో అవకాశం వచ్చిన ప్రతీసారి తన విలువను ప్రదర్శించాడు. టిమ్‌ డేవిడ్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో తన బాధ్యతను నెరవేర్చాడు. 

చివరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ చేతిలో దెబ్బతిన్నా... భువీ, హాజల్‌వుడ్‌ ఇచ్చే ఆరంభం మరోసారి ఆర్‌సీబీకి కీలకం కానుంది. స్వింగ్, సీమ్‌కు అనుకూలించే ధర్మశాల మైదానం వారి ప్రదర్శనకు సరైన వేదిక కాగలదు. పూర్తి ఫిట్‌గా ఉంటే కోహ్లికి తోడుగా ఫిల్‌ సాల్ట్‌ ఓపెనింగ్‌ చేయడం ఖాయం. లేదంటే వెంకటేశ్‌ అయ్యర్‌నే కొనసాగిస్తారు. స్పిన్నర్‌ సుయాశ్‌ స్థానంలో పేసర్‌ డఫీని ఆడించే అంశాన్ని కూడా మేనేజ్‌మెంట్‌ పరిశీలిస్తోంది.  

టాప్‌–3 బ్యాటింగ్‌తోనే..
గుజరాత్‌ జట్టు ధర్మశాలలో ఇప్పటి వరకు ఒక్క ఐపీఎల్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు. ఇది కొంత ప్రతికూలమే అయినా... పదునైన పేస్‌ బౌలింగ్‌ బృందం ఆ లోటు కనపడనీయకుండా చేయగలదు. సిరాజ్, రబాడ అద్భుతంగా బౌలింగ్‌ చేస్తుండగా, అర్షద్‌ ఖాన్‌ కూడా నిలకడగా రాణించాడు. రబాడ కూడా 24 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, తక్కువ వికెట్లే (17) తీసినా... సిరాజ్‌ ఎంతో ప్రభావం చూపించాడు. 

ఆల్‌రౌండర్‌ హోల్డర్‌ పేస్‌ బౌలింగ్‌ కూడా జట్టుకు అదనపు బలంగా మారింది. రషీద్‌ ఖాన్‌ ఎప్పటిలాగే మరోసారి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఇస్తే బెంగళూరు మిడిలార్డర్‌ను కట్టడి చేయగలడు. గత మ్యాచ్‌లో ఆర్‌సీబీని గుజరాత్‌ ఓడించడంలో అతనిదే ప్రధాన (2/19) పాత్ర. పిచ్‌ పరిస్థితిని బట్టి ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ప్రసిధ్‌ లేదా సాయికిషోర్‌లలో ఒకరికి చాన్స్‌ లభిస్తుంది. 

బ్యాటింగ్‌లో మరోసారి టైటాన్స్‌ టాప్‌–3పైనే ఆధారపడుతోంది. సాయిసుదర్శన్‌ (638), శుబ్‌మన్‌ గిల్‌ (616), జోస్‌ బట్లర్‌ (469) చెలరేగడంతోనే టైటాన్స్‌ ప్రస్థానం ప్లే ఆఫ్స్‌ వరకు చేరింది. వాషింగ్టన్‌ సుందర్‌ (303) కూడా నిలకడగా తన వంతు పాత్ర పోషించాడు.

పిచ్, వాతావరణం
భారీ స్కోర్లకు వేదిక ఇది. ఈ సీజన్‌లో ధర్మశాల మైదానంలో మూడు లీగ్‌ మ్యాచ్‌లు జరిగాయి. ఐదు ఇన్నింగ్స్‌లలో 200కు పైగా స్కోరు నమోదు కాగా, మరో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు వచ్చాయి. డే మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ నెగ్గగా... సాయంత్రం జరిగిన రెండు మ్యాచ్‌లలో కూడా ఛేదన చేసిన టీమ్‌ విజయం సాధించింది. 

ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌ సమయంలో బ్యాట్‌ను తాకిన బంతి వాతావరణం కారణంగా చాలా వేగంగా దూసుకుపోవడం ఖాయం. పంజాబ్‌పై ముంబై గెలిచిన మ్యాచ్‌లో ఇది బాగా కనిపించింది. వర్షసూచన లేదు. 

 

 చదవండి: ఈ చిత్రం చూశారా.. వైభవ్‌ ఫ్యామిలీ మొత్తం ఒకేలా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement