టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్‌తో రింకూ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) కీలక ప్రకటన చేసింది. తమ జట్టు వైస్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్, టీ20 ప్రపంచకప్ విజేత రింకూ సింగ్‌ను నియమించినట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి కేకేఆర్ మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఐపీఎల్-2024లో కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) జట్టును చాంపియన్‌గా నిలిపాడు. అయితే, మెగా వేలం-2025కి ముందు యాజమాన్యంతో విభేదాలు తలెత్తగా అతడు జట్టును వీడాడు. ట్రోఫీ అందించిన కెప్టెన్ అయినప్పటికీ కేకేఆర్ అతడిని ఆపే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వచ్చాయి.
కెప్టెన్‌గా రహానే
ఇక మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ రూ. 26.75 కోట్ల రికార్డు ధరకు శ్రేయస్‌ను కొనుగోలు చేసి.. కెప్టెన్‌ను చేసింది. ప్రతిగా 2025లో జట్టును ఫైనల్‌కు చేర్చి అతడు సత్తా చాటాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ స్థానంలో కేకేఆర్ అనూహ్య రీతిలో టీమిండియా వెటరన్ ఆటగాడు అజింక్య రహానేను కెప్టెన్‌గా నియమించింది.
గతేడాది రహానే సారథ్యంలో కేకేఆర్ పద్నాలుగు మ్యాచ్‌లకు కేవలం ఐదే గెలిచి.. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. అయినప్పటికీ కేకేఆర్ ఈ ఏడాది కూడా రహానేను కెప్టెన్‌గా కొనసాగించనుంది.
భవిష్య కెప్టెన్ రింకూనే
నిజానికి రింకూకే సారథ్య బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. ఆకాశ్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు సైతం రింకూ చుట్టు జట్టును అభివృద్ధి చేయాలని సూచించారు. అయితే, తాజాగా అతడిని రహానే డిప్యూటీగా నియమిస్తూ కేకేఆర్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. దీనిని బట్టి కేకేఆర్ భవిష్య కెప్టెన్ రింకూనే అని యాజమాన్యం సంకేతాలు ఇచ్చినట్లు అయింది.
కాగా 2018 నుంచి రింకూ సింగ్ కేకేఆర్‌తో కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు 59 మ్యాచ్‌లలో కలిపి 1099 పరుగులు సాధించాడు. ఫినిషర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అదే జోరులో టీమిండియా తరఫునా ఎంట్రీ ఇచ్చి టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన జట్టులో రిజర్వు ప్లేయర్‌గా ఉన్నాడు. ఇక ఇటీవల ముగిసిన పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ 2026 గెలిచిన భారత జట్టులో అతడు సభ్యుడు.
పేద కుటుంబం
ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూది పేద కుటుంబం. అయినప్పటికీ అనేక సవాళ్లకు ఎదురు నిలిచి క్రికెటర్‌గా ఎదిగాడు. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాది లైమ్‌లైట్‌లోకి వచ్చిన రింకూ ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. గతేడాది మినీ వేలానికి ముందు కేకేఆర్ రింకూను రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. అయితే, అతడి విజయాలను పూర్తిస్థాయిలో ఆస్వాదించకుండానే.. ముఖ్యంగా టెస్టుల్లో రింకూ ఆడాలన్న కోరిక తీరకుండానే అతడి తండ్రి ఇటీవలే మరణించాడు.
లోక్‌సభ ఎంపీతో నిశ్చితార్థం
వరల్డ్‌కప్ సమయంలో తండ్రి కన్నుమూసినా బాధను దిగమింగి.. అంత్యక్రియలు ముగిసిన తర్వాత రింకూ మళ్లీ జట్టుతో చేరాడు. మరోవైపు.. త్వరలోనే రింకూ పెళ్లి బంధంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. లోక్‌సభ ఎంపీ, సుప్రీంకోర్టు లాయర్ ప్రియా సరోజ్‌తో గతేడాది అతడి నిశ్చితార్థం జరిగింది.
చదవండి: రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?
God’s plan has a new chapter ✨ pic.twitter.com/2Gsy55mipi
— KolkataKnightRiders (@KKRiders) March 24, 2026


