ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్లలో ఒకరైన జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్‌లో గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. ఈ స్టార్ ముంబై ఇండియన్స్ పేసర్ ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బుమ్రా స్థాయి బౌలర్‌కు ఇది ఖచ్చితంగా చేదు అనుభవమనే చెప్పాలి.
గత ఎడిషన్ చివరి మ్యాచ్‌తో (పంజాబ్ కింగ్స్‌పై 4-0-40-0) కలుపుకొని బుమ్రా ఐపీఎల్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో వికెట్లు లేకుండా ఉన్నాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో అత్యంత పొడవైన వికెట్‌లేని స్ట్రీక్. ఈ పేసు గుర్రం ఐపీఎల్‌లో 149 మ్యాచ్‌లు ఆడి 183 వికెట్లు తీయగా.. ఇప్పటివరకు ఇలాంటి చేదు అనుభవం ఎన్నడూ ఎదురుకాలేదు. ఒక మ్యాచ్ కాకపోతే మరో మ్యాచ్‌లో అయినా అతనికి వికెట్ దక్కేది. అలాంటిది ఏకంగా ఐదు మ్యాచ్‌లుగా అతనికి వికెట్ లేకపోవడమనేది నిజంగా ఆశ్చర్యకరం.
ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో బుమ్రా 122 బంతులు వేసినా ఒక్క వికెట్ కూడా తీయలేదు. బహుశా ఏ స్థాయి క్రికెట్‌లో అయినా అతనికి ఇది చేదు అనుభవమే అయ్యుంటుంది.
యార్కర్లు, స్లో బౌన్సర్లు, లో ఫుల్ టాస్ బంతులతో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే బుమ్రా ఉన్నట్లుండి వికెట్లకు ఎందుకు ముఖం వాచాడోనని ఫ్యాన్స్ అనుకుంటున్నాడు. ఈ సీజన్‌లో వికెట్లు తీయలేకపోయినా, పొదుపుగా బౌలింగ్ చేయడం బుమ్రాకు ఈ సీజన్‌లో సానుకూలాంశం. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో అతని ఎకానమీ రేట్ 8.20గా ఉంది.
తాజాగా ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకున్న బుమ్రా.. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్‌పై 3 ఓవర్లలో 32 పరుగులు.. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 ఓవర్లలో 21.. కేకేఆర్‌పై 4 ఓవర్లలో 35 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
ఇదిలా ఉంటే, నిన్న ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా మినహా మిగతా బౌలర్లంతా తేలిపోవడంతో ముంబై ఇండియన్స్ భారీగా పరుగులు సమర్పించుకుంది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో తడబడి 18 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. తద్వారా సీజన్‌లో హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొంది.
తొలి మ్యాచ్‌లో కేకేఆర్‌పై గెలుపు తర్వాత వరుసగా ఢిల్లీ, ఆర్‌ఆర్, ఆర్సీబీ చేతుల్లో పరాజయాలు ఎదుర్కొని, పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. తదుపరి మ్యాచ్‌లో ముంబై ఇదే వాంఖడే వేదికగా పంజాబ్ కింగ్స్‌తో (ఏప్రిల్ 16) తలపడనుంది.
ముంబై-ఆర్సీబీ మ్యాచ్ వివరాలు..
ఆర్సీబీ- 240/4(20)
ముంబై ఇండియన్స్- 222/5(20)
18 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్: ఫిల్ సాల్ట్
కీలక ప్రదర్శనలు
ఆర్సీబీ- ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లి (50), రజత్ పాటిదార్ (53), టిమ్ డేవిడ్ (34 నాటౌట్), కృనాల్ పాండ్యా (4-0-26-1)
ముంబై ఇండియన్స్- హార్దిక్ పాండ్యా (4-0-39-1), రూథర్‌ఫోర్డ్ (71 నాటౌట్)


