ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో రెండు జట్ల పోరాటం అధికారికంగా ముగిసింది. లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా వైదొలిగాయి. నిన్నటితో ఢిల్లీ క్యాపిటల్స్ భవిష్యత్తు కూడా తేలిపోయేదే. అయితే ఆ జట్టు పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించి, ప్లే ఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
గెలిచి నిలిచినా ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరడం అంత ఈజీ ఏమీ కాదు. మున్ముందు ఆ జట్టు మరిన్ని కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాలి. ప్రస్తుతం ఢిల్లీ 12 మ్యాచ్‌ల్లో 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ఆశలు కలిగి ఉండాలంటే, ఆ జట్టు తదుపరి ఆడాల్సిన రెండు మ్యాచ్‌ల్లో భారీ విజయాలు సాధించాలి. అప్పుడు కూడా ఫైనల్-4కు చేరుతుందన్న గ్యారెంటీ లేదు.
ఎందుకుంటే ఢిల్లీ కంటే ముందు ఆరు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్‌ల కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి. నిన్నటి ఓటమితో అప్పటిదాకా ప్లే ఆఫ్స్ బెర్త్‌పై ధీమాగా ఉండిన పంజాబ్ కూడా పోటీ పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తొలి 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించిన పంజాబ్.. చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని ప్లే ఆఫ్స్ అవకాశాలను ఇరకాటంలో పడేసుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 11 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. ప్రస్తుతం ఆర్సీబీ (14 పాయింట్లు), ఎస్‌ఆర్‌హెచ్ (14), గుజరాత్ (14).. పంజాబ్ కంటే (13) మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
పంజాబ్ లాగే సీజన్ ప్రారంభంలో వరుస విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ కూడా ప్లే ఆఫ్స్ రేసులో బలంగా ఉంది. ఆ జట్టు ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో ఆరో స్థానంలో ఉంది. సీజన్‌ను పరాజయాలతో ప్రారంభించి అనూహ్యంగా విజయాల బాట పట్టిన సీఎస్‌కే కూడా ప్లే ఆఫ్స్ రేసులో బలంగా నిలబడింది. ఇప్పటివరకు ఆ జట్టు కూడా 11 మ్యాచ్‌లు ఆడి 6 విజయాలతో (12 పాయింట్లు) ఐదో స్థానంలో ఉంది.
ఆర్సీబీ (14 పాయింట్లు), ఎస్‌ఆర్‌హెచ్ (14), గుజరాత్ (14) పంజాబ్ (13), సీఎస్‌కే (12), రాజస్థాన్ (12)ను కాదని కేవలం 10 పాయింట్లు ఉన్న ఢిల్లీ ప్లే ఆఫ్స్‌కు చేరడం దాదాపుగా అసాధ్యమే. పైగా ఆ జట్టుకు మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడే అవకాశం ఉంది. టాప్-6 జట్లకు తలో మూడు మ్యాచ్‌ల అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఢిల్లీకి ప్లే ఆఫ్స్ అవకాశాలు లేనప్పటికీ.. పూర్తిగా లేకపోలేదని మాత్రం చెప్పలేము. ఎందుకంటే మన్ముందు ఏమైనా జరగవచ్చు. ఏ జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరతాయని ఇప్పుడు అంచనా వేయడం కష్టం.


