ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 1) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 18.4 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌట్ కాగా.. ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
బ్యాటింగ్‌కు పెద్దగా సహకరించని పిచ్‌పై సమీర్ రిజ్వి (47 బంతుల్లో 70 నాటౌట్; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్బుతంగా ఆడి ఢిల్లీని గెలిపించాడు. అతనికి ట్రస్టన్ స్టబ్స్ (32 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, సిక్స్) సహకరించాడు.
లక్నో బౌలర్లు ఆరంభంలోనే 4 వికెట్లు తీసి ఢిల్లీపై ఒత్తిడి తెచ్చినప్పటికీ.. రిజ్వి, స్టబ్స్ బాధ్యతగా ఆడి తమ జట్టును విజయతీరాలు దాటించారు. లక్నో బౌలర్లలో మహ్మద్ షమీ (4-0-28-1), మొహిసిన్ ఖాన్ (4-1-19-1), ప్రిన్స్ యాదవ్ (3-0-20-2) అద్బుతంగా బౌలింగ్ చేశారు. అయితే లక్ష్యం మరీ చిన్నది కావడంతో వారు దాన్ని కాపాడుకోలేకపోయారు.
అంతకుముందు ఢిల్లీ బౌలర్లు కూడా చెలరేగిపోయి లక్నోను తక్కుక స్కోర్‌కే పరిమితం చేశారు. నటరాజన్ (4-0-29-3), ఎంగిడి (3.4-0-27-3), కుల్దీప్ యాదవ్ (4-0-31-2), అక్షర్ పటేల్ (3-0-17-1) లక్నో పతనాన్ని శాశించారు. లక్నో ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు.అబ్దుల్ సమద్ (36), మిచెల్ మార్ష్ (35) పర్వాలేదనిపించారు.


