ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 8) జరిగిన ఉత్కంఠ సమరంలో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగు తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఢిల్లీని గెలిపించేందుకు డేవిడ్ మిల్లర్ చివరి బంతి వరకు పోరాడి విఫలమయ్యాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు అవసరమైన తరుణంలో మిల్లర్ సింగిల్‌కు నిరాకరించడం కీలక తప్పిదంగా మారింది.
Backing our Tiger, always 🫂💙 pic.twitter.com/pAFouiVmVH
— Delhi Capitals (@DelhiCapitals) April 9, 2026
ఆఖరి బంతిని మిస్ చేయడంతో కుల్దీప్ యాదవ్ రనౌటయ్యాడు. దీంతో ఢిల్లీ పరుగు తేడాతో పరాజయంపాలైంది. అంతకుముందు ఓవర్‌లో (19) 23 పరుగులు బాది ఢిల్లీని గెలుపుకు చేరువ చేసింది కూడా మిల్లరే. ఇంత చేసి చివరికి మ్యాచ్ గెలిపించలేకపోవడంతో అతను తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.

ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్‌లో ఒంటరిగా కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను కదిలించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. బాధపడుతున్న మిల్లర్‌ను కెప్టెన్ అక్షర్ పటేల్, హెడ్ కోచ్ హేమాంగ్ బదానీ ఓదార్చారు. మిల్లర్ భావోద్వేగ క్షణాలను డీసీ తమ సోషల్‌మీడియాలో ఖాతాల్లో పోస్ట్ చేసింది. “Backing our Tiger, always 💙” అంటూ మిల్లర్‌కు మద్దతు తెలిపింది.

ఇది నాణేనికి ఒకవైపు.. మరోవైపు, కొందరు సొంత అభిమానులే మిల్లర్‌ను తిట్టిపోశారు. 19వ ఓవర్ ఐదో బంతిలో సింగిల్ తీసుంటే కనీసం సూపర్ ఓవర్‌కి అవకాశం ఉండేది. తప్పంతా మిల్లర్‌దే అంటూ సోషల్‌మీడియాలో దుమ్మెత్తిపోశారు. అంత అతి విశ్వాసం పనికి రాదంటూ మిల్లర్‌కు చీవాట్లు పెట్టారు.
నాణేనికి అటు ఇటు ఉన్న విషయాలను పక్కన పెడితే, మిల్లర్ చేసిన దాంట్లో తప్పేమీ లేదు. ఆ సందర్భంలో అనుభవమున్న ఏ బ్యాటర్ అయినా అలాగే చేస్తాడు. కొన్ని సందర్భాల్లో ఇలా మిస్ ఫైర్ అవడం సహజమే. ఇందులో మిల్లర్‌ను నిందించాల్సిన అవసరం లేదు.
ఎవరు ఔనన్నా, కాదన్నా ఈ సీజన్‌లో ఢిల్లీ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. తాజాగా గుజరాత్ చేతిలో ఓటమి మినహా, ఈ సీజన్‌లో ఆ జట్టు తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. వరుసగా లక్నో, ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తాజా ఓటమి తర్వాత కూడా మెరుగైన రన్‌రేట్ కలిగి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.
ఢిల్లీ-గుజరాత్ మ్యాచ్ హైలైట్స్
- GT 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది.
- గిల్ (70), బట్లర్ (52), సుందర్ (55) అర్ద సెంచరీలతో రాణించారు.
- ఛేదనలో DC ఓపెనర్లు కేఎల్ రాహుల్ (92), నిస్సంక (41) చెలరేగి ఆడారు.
- గాయపడిన చేతితో డేవిడ్ మిల్లర్ (41 నాటౌట్) చివరి బంతి వరకు పోరాడినప్పటికీ ఢిల్లీని గెలిపించలేకపోయాడు.
- రషీద్ ఖాన్ 4 ఓవర్లలో 3/17తో DC మిడిలార్డర్‌ను కుదిపేశాడు.


