టీ20 ప్రపంచకప్ 2026లో భీకర ఫామ్ ప్రదర్శించి, టీమిండియా టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించిన సంజూ శాంసన్.. మెగా టోర్నీ పూర్తైన కొద్ది రోజులకే ఫామ్ కోల్పోయాడు. ప్రస్తుతం జరుగుతున్న క్యాష్ రిచ్ లీగ్‌లో అతను ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు.
ఈ సీజన్‌కు ముందే రాజస్థాన్ రాయల్స్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు ట్రేడ్ అయిన చెటా.. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమై ఫ్యాన్స్‌ను నిరాశపరిచాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో 6 పరుగులకే ఔటైన సంజూ.. ఇవాళ (ఏప్రిల్ 3) పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఓ పరుగు అదనంగా చేసి 7 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.
అప్పటివరకు భీకర ఫామ్‌లో ఉండిన సంజూ తమ ఫ్రాంచైజీకి వచ్చే సరికి వరుసగా విఫలం కావడాన్ని సీఎస్‌కే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంద చెటా ఇది అంటూ బాధపడుతున్నారు. ప్రపంచకప్‌లో సూపర్ ఫామ్‌లో ఉండిన సంజూపై సీఎస్‌కే భారీ అంచనాలు పెట్టుకొని ఉంది. అయితే అతను వరుసగా రెండు మ్యాచ్‌ల్లో తేలిపోవడంతో ఫ్రాంచైజీ యాజమాన్యం సైతం తలలు పట్టుకుంది.
అసలే ఆ జట్టుకు ధోని అందుబాటులో లేడు. యువ చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ గాయం కారణంగా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. యువకులతో నిండిన ప్రస్తుత జట్టులో సంజూనే అనుభవజ్ఞుడు. ఇలాంటి పరిస్థితుల్లో సంజూ నుంచి ఆశించడం తప్పేమీ కాదు. నేటి మ్యాచ్‌లో సంజూ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో బౌండరీ బాది, ఆ మరుసటి బంతికే వికెట్ కీపర్ ప్రభ్‌సిమ్రన్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగింది. 7 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 71-1గా ఉంది. సంజూ త్వరగా ఔటైనా, ఆయుశ్ మాత్రే ధాటిగా ఆడుతున్నాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 43 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (14) అండగా ఉన్నాడు.
కాగా, ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే రాజస్థాన్ రాయల్స్ చేతిలో దారుణ పరాభవాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌లో సీఎస్‌కే కనీసం 130 పరుగులు కూడా చేయలేకపోయింది. వారు నిర్దేశించిన స్వల్ప లక్ష్యాన్ని రాయల్స్ బ్యాటర్లు ఆడుతూపాడుతూ ఛేదించారు. ఛేదనలో యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ఆదిలోనే తన జట్టు గెలుపును ఖరారు చేశాడు.


