ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి: రుతురాజ్‌ | IPL 2026: CSK Captain Ruturaj Gaikwad Comments after losing to SRH | Sakshi
Sakshi News home page

ఆ మూడు ఓవర్లే కొంపముంచాయి: రుతురాజ్‌

Apr 19 2026 9:11 AM | Updated on Apr 19 2026 9:11 AM

IPL 2026: CSK Captain Ruturaj Gaikwad Comments after losing to SRH

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 18) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 10 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే బౌలర్లు అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చి ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్లను కట్టడి చేసినప్పటికీ.. ఆతర్వాత బ్యాటర్లు లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమయ్యారు. ఒక్క బ్యాటర్‌ కుదురుగా క్రీజ్‌లో నిలబడినా, ఈ మ్యాచ్‌లో సీఎస్‌కే గెలిచేదే.

ఛేదనలో సగం మ్యాచ్‌ వరకు పట్టు నిలుపుకున్న సీఎస్‌కే, ఆతర్వాత అనూహ్యంగా ఒత్తిడికి చిత్తై లక్ష్యానికి 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 195 పరుగుల ఛేదనలో సీఎస్‌కే స్కోర్‌ 10 ఓవర్ల తర్వాత 111-3గా ఉండింది. ఈ దశలో ఆ జట్టు గెలుపు నల్లేరుపైనడకే అనుకున్నారు. అయితే ఆతర్వాత మూడు ఓవర్లు మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చేశాయి. 11, 12, 13 ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో ఆ ఓవర్లలో సీఎస్‌కే కేవలం 9 పరుగులు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది.

ఆతర్వాత ఓవర్లలోనూ సీఎస్‌కే బ్యాటర్లు అడపాదడపా పరుగులు చేసి గెలుపుపై ఆశలు సజీవంగానే ఉంచారు. అయితే చివరి ఓవర్లలో ఎస్‌ఆర్‌హెచ్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి సీఎస్‌కే బ్యాటర్లను కట్టడి చేశారు. ఛేదించదగ్గ లక్ష్యమే (6 బంతుల్లో 18 పరుగులు) కళ్ల ముందు ఉన్నా, సీఎస్‌కే బ్యాటర్లు దాన్ని అందుకోలేకపోయారు. ఫలితంగా సునాయాసంగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో సీఎస్‌కే ఓడింది.

ఈ ఓటమి అనంతరం సీఎస్‌కే కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ ఇలా అన్నాడు. ఇలాంటి పిచ్‌పై 195 పరుగుల లక్ష్యం ఏ రోజైనా సాధ్యమే. తొలుత 220–230 స్కోరు వచ్చేలా అనిపించింది. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి 30-40 పరుగులు నిరోధించగలగారు.  

10 ఓవర్ల తర్వాత 80 పరుగులు మాత్రమే అవసరం. 6 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక్క భాగస్వామ్యం నెలకొల్పగలిగినా మ్యాచ్‌ మాదే. కానీ ఆతర్వాత 3 ఓవర్లలో కేవలం 9 పరుగులే రావడం మ్యాచ్‌ స్వరూపాన్ని మర్చేసింది. డెత్‌ ఓవర్లలో 12–13 రన్స్‌ ఛేజ్‌ చేయడం కష్టంగా మారింది.

మా బౌలింగ్‌ యూనిట్‌ను ప్రశంసించాలి. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేశారు. పవర్‌ప్లేలో అభిషేక్‌ శర్మ బాగా ఆడినా, ఆతర్వాత మొమెంటమ్‌ తిరిగి పొందాం. జేమీ ఓవర్టన్, గుర్జప్నీత్‌ సింగ్, నూర్‌ అహ్మద్, అన్షుల్‌ కాంబోజ్.. అందరూ బాగా బౌలింగ్‌ చేశారు.

ముఖ్యంగా అన్షుల్‌ డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్నాడు. ఇందు కోసం అతను చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. చాలా స్పష్టంగా తన ప్లాన్స్‌ చెప్పి, కెప్టెన్‌ నేను ఇలా చేస్తానని నమ్మకంగా చెప్పే బౌలర్లు చాలా అరుదుగా ఉంటారు. మొత్తంగా అన్షుల్‌ ప్రతిరోజూ మెరుగుపడుతున్నాడు.  

రుతురాజ్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఈ మ్యాచ్‌లో ఓడినా, అతని బౌలర్లపై సంతృప్తిగానే ఉన్నాడు. ఛేదించదగ్గ లక్ష్యమే అయినా, కొద్ది ఓవర్లు కొంపముంచాయని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా సీఎస్‌కే హ్యాట్రిక్‌ ఓటములు, రెండు వరుస విజయాల తర్వాత మరో ఓటమిని మూటగట్టుకొని పాయింట్ల పట్టికలో ఏదో స్థానంలో కొనసాగుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement