
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన హై స్కోరింగ్ థ్రిల్లర్‌లో 11 పరుగుల తేడాతో పంజాబ్ విజయం సాధించింది. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది.
గుజరాత్ బ్యాటర్లలో సాయిసుదర్శన్(74), జోస్ బట్లర్(54) రూథర్ ఫర్డ్(46) పోరాడినప్పటకి తమ జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయారు. కెప్టెన్ శుబ్‌మన్ గిల్(33) తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ కొండంత లక్ష్యాన్ని కరిగించలేకపోయారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ రెండు, జానెసన్, మాక్స్‌వెల్ తలా వికెట్ సాధించారు.
శ్రేయస్ అయ్యర్ విధ్వంసం..
అంతకుముందు బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్( 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్స్‌లతో 97) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
అయ్యర్‌తో పాటు శశాంక్ సింగ్(16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 44), ప్రియాన్ష్ ఆర్య(47) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ మూడు వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్, రబాడ తలా వికెట్ సాధించారు. శ్రేయస్ అయ్యర్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.