
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025 సస్పెన్షన్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) మరో కీలక ప్రకటన చేసింది. భారత్-పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది సీజన్‌ను వారం రోజుల పాటు తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. ఈ ఏడాది సీజన్ పూర్తిగా రద్దు అవుతుందన్న ఊహాగానాలకు భారత క్రికెట్ బోర్డు చెక్‌పెట్టింది.
"ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్-2025లో మిగిలిన మ్యాచులను వారం రోజుల పాటు తక్షణమే నిలిపివేయాలని బీసీసీఐ నిర్ణయించింది. సంబంధిత అధికారులు, వాటాదారులతో సంప్రదించి అప్పటి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తాము. చాలా ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి.
ఫ్రాంచైజీలు, ప్రసారకర్తలు, స్పాన్సర్లు అందరి అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాతే ఐపీఎల్ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకుంది. మన సాయుధ దళాల బలంపై బీసీసీఐకి పూర్తి విశ్వాసం ఉన్నప్పటికీ, స్టేక్ హోల్డర్స్ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించడం ముఖ్యమైనది బోర్డు భావించింది.
అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది" అని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది సీజన్ తిరిగి మళ్లీ మే 16 నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. కాగా గురువారం ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ అర్ధాంతంగా రద్దు అయింది. భద్రతా కారాణాల దృష్ట్యా మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు. ఆ తర్వాత జరిగిన సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
చదవండి: ఆపరేషన్ సిందూర్ 2.0పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు