
Photo Courtesy: BCCI
ఐపీఎల్ 2025లో భాగంగా నిన్న (మార్చి 25) జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌పై పంజాబ్ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ (97 నాటౌట్) సెంచరీ చేసే అవకాశం ఉన్నా, వదలుకుని తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఆరంభంలో ప్రియాంశ్ ఆర్య, ఆఖర్లో శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి పంజాబ్ భారీ స్కోర్ చేసేందుకు దోహద పడ్డారు.
భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ కూడా అద్భుతంగా పోరాడింది. అయితే మధ్య ఓవర్లలో పంజాబ్ బౌలర్లు వారిని దెబ్బకొట్టారు. ఇన్నింగ్స్ 15, 16, 17 ఓవర్లలో గుజరాత్ కేవలం 18 పరుగులే చేయగలిగింది. ఇక్కడే ఆ జట్టు మ్యాచ్‌ను కోల్పోయింది. పంజాబ్ బౌలర్లలో విజయ్‌కుమార్ వైశాక్, అర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు.
కీలక సమయంలో వరుస యార్కర్లతో విరుచుకుపడి గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేశారు. గుజరాత్ తరఫున సాయి సుదర్శన్, రూథర్‌ఫోర్డ్ మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. అయినా వారి మెరుపులు సరిపోలేదు. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు రాబట్టలేకపోవడమే గుజరాత్ కొంపముంచింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. శ్రేయస్ 42 బంతుల్లో 5 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 97 పరుగులు (నాటౌట్), శశాంక్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 44 పరుగులు (నాటౌట్), ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 47 పరుగులు చేశారు. మ్యాక్స్‌వెల్ డకౌట్ కాగా.. ఒమర్‌జాయ్ 16, స్టోయినిస్ 20 పరుగులు చేశారు.
గుజరాత్ బౌలర్లలో సాయికిషోర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 30 పరుగులే ఇచ్చి 3 వికెట్లు తీయగా.. రబాడ, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), శుభ్‌మన్ గిల్ (14 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), జోస్ బట్లర్ (33 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), రూథర్‌ఫోర్డ్ (28 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ 2, జన్సెన్, మ్యాక్స్‌వెల్ తలో వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ అనంతరం గుజరాత్ కెప్టెన్ శుభ్‌న్ గిల్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మంచి అవకాశాలు లభించాయి. అయితే మేము వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాం. చాలా పరుగులు ఇచ్చామని అనుకుంటున్నాను. మా విజయావకాశాలను చేజేతులా వదులుకున్నాం. 15, 16, 17 ఓవర్లలో కేవలం 18 పరుగులే చేసాము. మొదటి మూడు ఓవర్లు కూడా ఎక్కువ పరుగులు చేయలేకపోయాము. ఇక్కడే మేము ఆటను కోల్పోయాము. చాలా సానుకూల అంశాలు కూడా ఉన్నాయి. సీజన్‌కు మంచి ప్రారంభం లభించిందని అనుకుంటున్నాను.
విజయ్ కుమార్ వైశాక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 15 ఓవర్లు బెంచ్‌పై కూర్చొని, ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చి యార్కర్లు వేయడం అంత సులభం కాదు. వరుసగా యార్కర్లు వేయగలిగినందుకు వారికి (పంజాబ్ బౌలర్లు) క్రెడిట్ ఇవ్వాలి. ఈ వికెట్ బ్యాటింగ్ చేసేందుకు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఈజీగా 240-250 పరుగులు స్కోర్ చేయవచ్చు. అయితే ఆ స్కోర్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది.