IPL 2021: సీఎస్‌కే కెప్టెన్‌పై ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు

Aakash Chopra Comments On MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కెప్టెన్ ఎంఎస్ ధోనిపై ప్రముఖ వ్యాఖ్యాత, భారత మాజీ ఆటగాడు ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత ఐపీఎల్‌లో సీఎస్‌కే 10 మంది బ్యాటర్లతోనే ఆడుతోందని.. ధోని వికెట్‌కీపర్, కెప్టెన్‌గానే సేవలందిస్తున్నాడని.. అతని బ్యాటింగ్‌తో జట్టుకు ఎలాంటి ప్రయోజనం లేదని ధోనిపై పరోక్ష విమర్శలు గుప్పించాడు. బ్యాటర్‌గా ధోని జట్టులో ఉన్నా.. లేనట్టేనని, ప్రస్తుత సీజన్‌లో అతని గణాంకాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు. అయితే కెప్టెన్సీ విషయంలో ఆకాశ్ చోప్రా ధోనిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
గతేడాది దారుణంగా విఫలమైన జట్టును అద్భుతంగా ముందుండి నడిపిస్తున్నాడని, సరైన వ్యూహాలు రచించి జట్టును విజయపథం నడిపించడం ధోనికి మాత్రమే సాధ్యమని కొనియాడాడు. ధోని లాంటి వ్యక్తి కెప్టెన్‌గా ఉండడం సీఎస్‌కేకు అదనపు బలమని, జట్టును ఓటమి కోరల్లో నుంచి సైతం బయటపడేయగల సామర్ధ్యం ధోని సొంతమని ఆకాశానికెత్తాడు. కాగా, ధోని ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 11.40 సగటున కేవలం 66 పరుగులు మాత్రమే స్కోర్ చేశాడు. బ్యాటర్‌గా దారుణంగా విఫలమైనా కెప్టెన్సీలో మాత్రం దుమ్మురేపుతున్నాడు. ఐపీఎల్-2021లో ధోని సారధ్యంలో సీఎస్‌కే జట్టు ఇప్పటివరకు ఆడిన 11 మ్యాచ్‌ల్లో 9 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
చదవండి: సచిన్‌ను చూసాక ఇషాన్ కిషన్ రియాక్షన్.. నవ్వు ఆపుకోలేకపోయిన పొలార్డ్