హైదరాబాద్‌ను వద్దనుకున్నారు.. ఇప్పుడు తప్పదేమో!

IPL 2021: BCCI Keeps Hyderabad In Back Up Venue Plans - Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-14వ సీజన్‌ అనుకున్నప్పట్నుంచీ హైదరాబాద్‌ మాట వినిపిస్తూనే ఉంది. ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్‌ను వేదికగా నిర్ణయిస్తే బాగుంటుందని బీసీసీఐ పెద్దలు షెడ్యూల్‌ ఖరారు చేసిన సమయంలో ఆలోచన చేసినప్పటికీ దానికి ముందడుగు పడలేదు. చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలతో పాటు ముంబైను చివరకు వేదికగా ఖరారు చేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే అది అంత మంచి ఆలోచన కాదనేది ప్రస్తుత పరిస్థితుల్ని బట్టి అర్థమవుతోంది. ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో ఆటగాళ్లు ఎంత బయో బబుల్‌ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ఒక్కొక్కరిగా కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు అక్షర్‌ పటేల్‌కు కరోనా సోకింది. సిబ్బందిలో 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. కరోనా పాజటివ్‌గా సోకిన వారందరిని ఐసోలేషన్‌ కేంద్రానికి తరలించారు. దాంతో కరోనా కలవరం ఐపీఎల్‌ ఫ్రాంచైజీల్లో మొదలైంది. ముంబైలో సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌లు తమ ఐపీఎల 2021 సీజన్‌ను ఆరంభించాల్సి ఉంది. ఈ జట్లలోని ఆటగాళ్లు ఎవరూ బయట వ్యక్తులతో ఎటువంటి కాంటాక్ట్‌ లేకుండా కఠినమైన నిబంధనలను పాటిస్తున్నారు. అయినప్పటికీ కరోనా కలవర పరుస్తోంది. దీనిపై బీసీసీఐ తర్జన భర్జన పడుతోంది. వాంఖడే స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన చేస్తుంది. ముంబైలో మ్యాచ్‌ల నిర్వహణ కష్ట సాధ్యంగా ఉన్న క్రమంలో వేరే వేదికగా కోసం ఆలోచిస్తోంది.

ఇక్కడ వేదికల బ్యాకప్‌ రేసులో హైదరాబాద్‌ ముందు వరుసలో ఉంది. తాము ఐపీఎల్‌-2021 నిర్వహణకు సిద్ధంగా ఉన్నమంటూ తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్‌ గతంలోనే ఓ ప్రకటన విడుదల చేశారు. మరి వారం రోజుల సమయం కూడా అందుబాటులో లేని తరుణంలో ముంబైలోని జరగాల్సిన మ్యాచ్‌లను హైదరాబాద్‌కు మార్చడం కష్టతరమే కావచ్చు. కానీ అసాధ్యమేమీ కాదు. కాగా, అప్పుడు హైదరాబాద్‌ను వద్దనుకున్న బీసీసీఐ పెద్దలకు ఇప్పుడు అదే వేదికలో మ్యాచ్‌ల నిర్వహణ తప్పేలా కనిపించడం లేదు. మరి దీనిపై ఏం నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ 2021: వాంఖడేలో కరోనా కలకలం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top