Tim Paine scandal: క్రికెట్‌కు తప్పని రాసలీలల చెదలు.. సెక్స్‌ స్కాండల్‌లో నలిగిన ఆటగాళ్లు

Intresting Facts Cricketers Molested Scandal After Tim Paine Issue - Sakshi

క్రికెట్‌ చరిత్రలో కొంతమంది ఆటగాళ్లు ఎంతమంచి పేరు తెచ్చుకున్నప్పటికీ వారి వ్యక్తిగత జీవితంలో చేసిన తప్పులు కెరీర్‌కు మాయని మచ్చగా మిగిలిపోతాయి. తాజాగా టిమ్‌ పైన్‌ ఉదంతం అందుకు ఉదాహరణ. బాల్‌ టాంపరింగ్‌ ఉదంతంతో స్మిత్‌ కెప్టెన్సీ కోల్పోగా.. అతని నుంచి బాధ్యతలు స్వీకరించిన టిమ్‌ పైన్‌ ఆస్ట్రేలియాను బాగానే నడిపించాడు. అయితే కీలకమైన యాషెస్ సిరీస్‌కు ముందు టిమ్‌పైన్‌పై సెక్స్‌ ఆరోపణలు వచ్చాయి. 2017లో ఒక మహిళతో అసభ్యకరమైన చాటింగ్‌ చేసినట్లు తేలింది. ఇది నిజమేనని ఒప్పుకున్న పైన్‌ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆటగాడిగా మంచిపేరు తెచ్చుకున్నప్పటికి సెక్స్‌ స్కాండల్‌ ఉదంతం అతని కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలిపోనుంది. ఈ నేపథ్యంలో గతంలోనూ క్రికెటర్లు సెక్స్‌ ఆరోపణలు ఎదుర్కొన్నారు. 
- సాక్షి, వెబ్‌డెస్క్‌

షాహిద్ అఫ్రిది:


మేటి ఆల్‌రౌండర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పాకిస్తాన్‌ మాజీ ఆటగాడు షాహిద్‌ అఫ్రిది వివాదాల్లోనూ అంతే గుర్తింపు పొందాడు. ఒక దశలో రిటైర్మెంట్ ప్రకటించి మళ్లీ వెనక్కి వచ్చిన అఫ్రిది సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించాడు తన కెరీర్‌లాగే ఆఫ్రిదీ జీవితంలో వివాదాలు చాలా ఎక్కువే. ఓ టోర్నీ కోసం సింగపూర్‌ వెళ్లిన అఫ్రిది.. అక్కడ మరో క్రికెటర్‌తో కలిసి ఇద్దరు అమ్మాయిలతో గడుపుతూ అడ్డంగా దొరికిపోయాడు. దీంతో ఆఫ్రిదీని  2000 ఐసీసీ ఛాంపియన్స్‌ట్రోఫీ నుంచి  తప్పిస్తూ పీసీబీ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా నిలిచింది.

చదవండి: Tim Paine: మహిళకు అసభ్యకరమైన సందేశాలు.. ఆసీస్‌ కెప్టెన్సీకి రాజీనామా

అబ్దుల్‌ రజాక్‌:


పెళ్లయిన తర్వాత తనకు చాలా మంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అబ్దుల్ రజాక్ స్వయంగా వెల్లడించాడు. ఒక టీవీ కార్యక్రమంలో, 39 ఏళ్ల మాజీ క్రికెటర్ తనకు ఆరుగురు మహిళలతో  అక్రమ సంబంధం కలిగి ఉన్నట్లు ఒప్పుకున్నాడు. అందులో ఒక మహిళతో ఒకటిన్నర సంవత్సరాలు డేటింగ్ చేశాడని ఒప్పుకున్నాడు.

షాహిన్ అఫ్రిది:


ప్రస్తుతం పాకిస్తాన్‌ క్రికెట్‌లో షాహిన్‌ అఫ్రిది ఒక సంచలనం. రోజురోజుకు ఆటలో పదును పెంచుకుంటున్న షాహిన్‌ అఫ్రిది వ్యక్తిగత జీవితంలో మాత్రం బ్యాడ్‌బాయ్‌గా ముద్ర వేసుకున్నాడు. చాలా మంది అమ్మాయిలతో రొమాంటిక్ రిలేషన్‌షిప్‌ను ఏర్పరచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయ్. షాహీన్ ప్రైవేట్ చాట్ స్క్రీన్ షాట్‌ను ఓ బాధితురాలు పోస్ట్ చేసింది. అమ్మాయిల్ని ట్రాప్ చేయడంలో అఫ్రిది ముందుంటాడని ఆమె ఆరోపించింది. 

షేన్ వార్న్ :


సెక్స్‌ స్కాండల్‌ అనగానే మొదటగా గుర్తుకువచ్చేది ఆసీస్‌ లెజెండరీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌. క్రికెట్‌ చరిత్రలో మేటి స్పిన్నర్‌గా నిలిచిపోయిన వార్న్‌ కెరీర్‌లో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. అతను హాంప్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు కొందరు మోడళ్లతో సరసాలాడడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత మెల్‌బోర్న్‌లో హోటల్‌ గదిలో పలువురు మహిళలను లైంగికంగా వేధించాడని  ఆరోపణలు వచ్చాయి. ఇక యాషెస్ సిరీస్ లో భాగంగా.. బ్రిటిష్ నర్సును లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి

హర్షలే గిబ్స్‌:


దక్షిణాఫ్రికా ఓపెనర్‌గా ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న హర్షలే గిబ్స్‌ వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచేవాడు. అమ్మాయిలతో తాను ప్రవర్తించిన తీరును గిబ్స్‌ తన తన ఆత్మకథ (టు ది పాయింట్) లో స్వయంగా వెల్లడించడం విశేషం. ఆ ఆత్మకథలో తాను మహిళలతో ప్రవర్తించిన తీరును గూర్చి వివరించడం వివాదాలకు దారి తీసింది.

క్రిస్‌ గేల్‌:


యూనివర్సల్ బాస్ అని ముద్దుగా పిలుచుకునే క్రిస్ గేల్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. ఎంజాయ్‌కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన గేల్‌.. 2012లో శ్రీలంక వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్‌ సమయంలో ముగ్గురు బ్రిటిష్ మహిళలను తన హోటల్ గదులకు బలవంతంగా తీసుకెళ్లినట్లు ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. హోటల్‌ బాడీగార్డ్‌ సాయంతో ఆ ముగ్గురు మహిళలు అక్కడి నుంచి తప్పించుకున్నట్లు తెలిసింది. అయితే ఇందులో ఎంత నిజమనేది తెలియరాలేదు.

కెవిన్‌ పీటర్సన్‌:


ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్.. కెవిన్ పీటర్సన్ కూడా సెక్స్‌ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. దక్షిణాఫ్రికా 'బిగ్ బ్రదర్' సెలబ్రిటీ వెనెస్సా నిమ్మోతో ఎఫైర్ కలిగి ఉన్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇది పీటర్సన్‌ కెరీర్‌లో మాయని మచ్చగా మిగిలిపోయింది.

ఇయాన్‌ బోథమ్‌:


క్రికెట్ లో గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న సర్ ఇయాన్ బోథమ్ కూడా సెక్స్‌ ఆరోపణలు ఎదుర్కోవడం విశేషం. మైదానంలో హుందాగా ప్రవర్తించే ఈ క్రికెటర్‌ బయట అపకీర్తిని మూటగట్టుకున్నాడు. భోథమ్‌ తన భార్యను మోసం చేస్తూ వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. అంతేగాక బోథమ్‌కు ఆస్ట్రేలియన్ వెయిట్రెస్‌తో కూడా ఎఫైర్ ఉంది.ఇక మాజీ మిస్ యునివర్స్‌ బార్బడోస్ లిండీ ఫీల్డ్‌తో భోథమ్‌ నడిపిన అఫైర్‌ 1980లలో క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేసింది.

మహ్మద్‌ షమీ:


టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీపై ఇలాంటి ఆరోపణలు రావడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. స్వయంగా షమీ భార్య హసిన్‌ జహాన్‌ .. నా భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయంటూ పేర్కొనడం సంచలనం సృష్టించింది.  దీంతో షమీ ఇబ్బందుల్లో పడ్డాడు. అతను ఇతర మహిళలతో షమీ చాట్ చేస్తున్న ఫోటోలను జహాన్ మీడియాతో పంచుకుంది. ప్రస్తుతం వీరిద్దరు వేరువేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే.

చదవండి: Steve Smith As Test Captain: ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్‌గా మరోసారి స్టీవ్‌ స్మిత్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top