
భారత్, ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ తొలి రోజు ఆటలో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని "బౌలింగ్ బాగుందిరా మావా" అంటూ తెలుగులో ప్రశంసించాడు.
ఆట చివర్లో లేడీబర్డ్స్ (ఆరుద్ర పురుగులు) మైదానాన్ని ఆవహించి ఆటగాళ్లను తెగ ఇబ్బంది పెట్టాయి. రూట్ 99 పరుగుల వద్ద ఉండగా రవీంద్ర జడేజా తనదైన శైలిలో "నాటీ" పనులు చేశాడు. ఇవే కాకుండా నిదానంగా ఆడుతున్న ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్‌ను సిరాజ్ "బజ్‌బాల్ ఏది" అంటూ రెచ్చగొట్టాడు. మొత్తంగా తొలి రోజు ఆట ఆసక్తికరంగా సాగింది.

బౌలింగ్ బాగుందిరా మావా..!
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. తమ ఇన్నింగ్స్‌ను 13 ఓవర్ల వరకు సజావుగా సాగించింది. అయితే అప్పటివరకు స్థిరంగా సాగిన ఇంగ్లండ్ బ్యాటింగ్ నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ ధాటికి ఒక్కసారిగా కుదుపుకు లోనైంది. నితీశ్ 14వ ఓవర్ మూడో బంతికి బెన్ డకెట్, ఆరో బంతికి జాక్ క్రాలేను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను కష్టాల్లోకి నెట్టాడు.
GILL SPEAKING TELUGU TO NITISH KUMAR REDDY. 😂🔥 pic.twitter.com/NG5buxINBG
— Johns. (@CricCrazyJohns) July 10, 2025
ఈ క్రమంలో నితీశ్‌ను భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలుగులో ప్రత్యేకంగా అభినందించాడు. 'బౌలింగ్ బాగుందిరా మావ' అంటూ ప్రశంసించాడు. అతడి మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

బజ్‌బాల్ ఏది..?
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ మరోసారి తన నోటికి పనిచెప్పాడు. తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జో రూట్‌ను స్లెడ్జింగ్ చేశాడు. ఇన్నింగ్స్ 31 ఓవర్ వేసిన సిరాజ్.. అద్బుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి రూట్‌ను ఇబ్బందిపెట్టాడు.
Siraj - "Bazball, Comeon I want to see it". 🥶🔥
- It's fun at Lord's....!!! pic.twitter.com/7Ma3OiRPc2— Johns. (@CricCrazyJohns) July 10, 2025
ఆ ఓవర్‌లో ఆరు బంతులు ఎదుర్కొన్న రూట్ కనీసం ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. దీంతో ఓవర్ పూర్తియ్యాక రూట్ వద్దకు సిరాజ్ వెళ్లి "దమ్ముంటే బాజ్‌బాల్ ఇప్పడు ఆడండి. నేను చూడాలనుకుంటున్నాను" అని సీరియస్‌గా అన్నాడు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

బుమ్రాను బయపెట్టిన లేడీబర్డ్స్
తొలి రోజు ఆట చివర్లో (81వ ఓవర్) మైదానంలో ఆటగాళ్లపై లేడీబర్డ్స్ (ఆరుద్ర పురుగులు) దాడి చేశాయి. దీంతో ఇరు జట్ల ఆటగాళ్లు చాలా అసౌకర్యానికి గురయ్యారు. ముఖ్యంగా టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా చాలా ఇబ్బంది పడ్డాడు. పదునైన బంతులతో ప్రత్యర్ధి బ్యాటర్లను భయబ్రాంతులకు గురి చేసే బుమ్రా లేడీబర్డ్స్ దెబ్బకు భయపడినట్లు కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్‌మీడియాలో వైరలవుతోంది.
నాటీ జడేజా..!
మైదానంలో సరాదాగా ఉండే రవీంద్ర జడేజా తొలి రోజు ఆట చివరి ఓవర్‌లో జో రూట్‌ను తనదైన శైలిలో ఆటపట్టించాడు. ఆకాశ్‌దీప్ బౌలింగ్‌లో రూట్ 98 పరుగుల వద్ద ఓ పరుగు తీసి సెంచరీ పరుగు కోసం చూస్తుండగా జడేజా అతన్ని ఆటపట్టించాడు. జడేజా తనదైన శైలిలో రూట్‌తో చతుర్లాడిన సన్నివేశాలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.
JADEJA HAVING FUN WITH ROOT IN THE FINAL OVER 😂🔥 pic.twitter.com/zLd6ul83X9
— Johns. (@CricCrazyJohns) July 10, 2025
మ్యాచ్ విషయానికొస్తే.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 4 వికెట్ల నష్టానికి 251 పరుగులు (83 ఓవర్లలో) చేసింది. జో రూట్ 99 (191 బంతుల్లో 9 ఫోర్లు), కెప్టెన్ బెన్ స్టోక్స్ 39 పరుగులతో (102 బంతుల్లో 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో జాక్ క్రాలే 18, బెన్ డకెట్ 23, ఓలీ పోప్ 44, హ్యారీ బ్రూక్ 11 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో నితీశ్ కుమార్ రెడ్డి 2, బుమ్రా, రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు.