మహిళల వరల్డ్‌కప్‌-2025 విజేతగా భారత్‌ | Indin womens cricket team wins Maiden odi world cup | Sakshi
Sakshi News home page

మహిళల వరల్డ్‌కప్‌-2025 విజేతగా భారత్‌

Nov 3 2025 12:02 AM | Updated on Nov 3 2025 12:35 AM

Indin womens cricket team wins Maiden odi world cup

భారత మహిళల జట్టు  47 ఏళ్ల తమ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్‌-2025 విజేతగా భారత్‌ నిలిచింది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. తొలి వరల్డ్‌కప్‌ టైటిల్‌ను ముద్దాడింది. 299 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా 45.3 ఓవర్‌లో 246 పరుగులకు ఆలౌటైంది.

సౌతాఫ్రికా కెప్టెన్‌ ఒంటరి పోరాటం..
సౌతాఫ్రికా కెప్టెన్‌ లారా వోల్వార్డ్ట్ ఒంటరి పోరాటం చేసింది.  98 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్స్‌ సాయంతో 101 పరుగులు చేసింది. లారా క్రీజులో ఉన్నంతసేపు భారత డగౌట్‌తో పాటు అభిమానులలో టెన్షన్‌  నెలకొంది. దీప్తీ శర్మ బౌలింగ్‌లో వోల్వార్డ్ట్ ఔట్‌ కావడంతో భారత విజయం ఖాయమైంది. అమన్‌ జ్యోత్‌ కౌర్‌ అద్బుత క్యాచ్‌తో వోల్వార్డ్ట్ పెవిలియన్‌కు పంపించింది.

శెభాష్‌ షఫాలీ..
ఈ ‍మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్‌ షఫాలీ వర్మతో బ్యాట్‌తో బంతితో మ్యాజిక్‌ చేసింది. భారీ లక్ష్య చేధనలో 51 పరుగుల వద్ద సౌతాఫ్రికా తొలి వికెట్‌ కోల్పోయింది. బ్రిట్స్‌ రనౌట్‌ రూపంలో వెనుదిరిగింది. అనంతరం క్రీజులోకి వచ్చిన బోష్‌ కూడా ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరింది. 

ఈ సమయంలో సౌతాఫ్రికా కెప్టెన్‌ లారా.. వన్‌ డౌన్‌ బ్యాటర్‌ లూస్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పింది. భారత కెప్టెన్‌ హర్మన్‌ ఎంత మంది బౌలర్లను మార్చిన ఫలితం లేకపోయింది. 

దీంతో పార్ట్‌ టైమ్‌ బౌలర్‌ షఫాలీకి హర్మన్‌ బంతిని అందించింది. కెప్టెన్‌ నమ్మకాన్ని షఫాలీ వమ్ము చేయలేదు. అద్బుతమైన సన్నీ లూస్‌ను షఫాలీ బోల్తా కొట్టించింది. ఆ తర్వాత డేంజరస్‌ బ్యాటర్‌ కాప్‌ను కూడా వర్మ పెవిలియన్‌కు పంపింది. రెండు కీలక వికెట్లు పడగొట్టి భారత్‌ను వరల్డ్‌ ఛాంపియన్‌గా షఫాలీ నిలిపింది.

ఐదేసిన దీప్తి..
ఇక భారత్‌ తొలిసారి వరల్డ్‌కప్‌ను సొంతం చేసు​కోవడంలో స్టార్‌ ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మది కీలక పాత్ర. తొలుత బ్యాటింగ్‌లో హాఫ్‌ సెంచరీతో మెరిసిన దీప్తి.. బౌలింగ్‌లో బంతితో అద్బుతం చేసింది. ఈ యూపీ క్రికెటర్‌ ఐదు వికెట్లతో ప్రోటీస్‌ పతనాన్ని శాసించింది. 9.3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన శర్మ..39 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టింది. మొత్తంగా 17 వికెట్లతో దీప్తి ప్లేయర్‌ ఆఫ్‌ది టోర్నమెంట్‌గా నిలిచింది.

బ్యాటింగ్‌లో అదుర్స్‌..
అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన మన అమ్మాయిల జట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 298 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. భారత ఇన్నింగ్స్‌లో షెఫాలీ వర్మ(78 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 87) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దీప్తి శర్మ(58 బంతుల్లో 58), రిచా ఘోష్‌(24 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 34), మంధాన(45) రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో అయబొంగా ఖాకా మూడు వికెట్లు పడగొట్టగా.. మలాబా, క్లార్క్‌, ట్రయాన్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: IND vs AUS T20 Series: ఉన్న‌ప‌ళంగా స్వ‌దేశానికి టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement