సమరానికి సై... | Sakshi
Sakshi News home page

సమరానికి సై...

Published Wed, Dec 6 2023 12:59 AM

Indias first T20 match against England womens team today - Sakshi

ముంబై: భారత పురుషుల జట్టు ఇటీవల పొట్టి ఫార్మాట్‌లో ఆ్రస్టేలియాపై అదరగొట్టింది. ఇప్పుడు భారత మహిళల జట్టు కూడా అలాంటి ప్రదర్శనే ఇచ్చేందుకు ఇంగ్లండ్‌తో టి20 సమరానికి సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడి వాంఖెడె స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగుతుంది. ఈ ఏడాది హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం ప్రత్యేకించి టి20 ఫార్మాట్‌లో రాణించింది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సహా... బంగ్లాదేశ్‌ గడ్డపై 2–1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

సఫారీ గడ్డపై జరిగిన ముక్కోణపు టి20 సిరీస్‌లోనూ భారత మహిళల జట్టు మెరుగ్గా రాణించి ఫైనల్లో రన్నరప్‌గా సంతృప్తి పడింది. అక్కడే జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, ఇంగ్లండ్‌ సెమీఫైనల్‌ చేరాయి. కానీ ప్రత్యర్థుల చేతిలో ఇరు జట్లు ఓటమి చవిచూశాయి. గతంలో కంటే మెరుగ్గా కనిపిస్తున్న భారత జట్టు  ఇప్పుడు ఇంగ్లండ్‌తో పేలవమైన గత రికార్డును మరిచేలా చక్కని ప్రదర్శన ఇవ్వాలనే పట్టుదలతో ఉంది.

ఐసీసీ టి20 ర్యాంకుల్లో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌ తమ సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో తొమ్మిది టి20 మ్యాచ్‌లాడితే కేవలం రెండు మ్యాచ్‌ల్లోనే నెగ్గింది. మరోవైపు రెండో ర్యాంకులో ఉన్న ఇంగ్లండ్‌ జట్టు 1–2తో శ్రీలంక చేతిలో ఓడింది. ఈ అనుకూలతలను వినియోగించుకొని ఫామ్‌లో ఉన్న హర్మన్‌ బృందం ఈ సిరీస్‌లో గట్టి సవాల్‌ విసిరేందుకు సన్నద్ధమైంది.

పురుషులతో పోల్చితే పరిమిత సంఖ్యలో జరిగే మ్యాచ్‌లతో అమ్మాయిల జట్టు... వచ్చే ఏడాది బంగ్లాదేశ్‌ ఆతిథ్యమిచ్చే టి20 ప్రపంచకప్‌కు మేటి జట్టుగా బరిలోకి దిగాలని ఆశిస్తోంది. ఓపెనర్‌  స్మృతి మంధాన, టాపార్డర్‌లో జెమీమా రోడ్రిగ్స్, మిడిలార్డర్‌లో హర్మన్‌ప్రీత్‌ ఫామ్‌లో ఉన్నారు. 
బౌలింగ్‌లో దీప్తి శర్మ, పూజ వస్త్రకర్‌ నిలకడగా  రాణిస్తున్నారు. 

పిచ్, వాతావరణం 
వాంఖెడె వికెట్‌ బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. తూర్పు తీరాన్ని తుఫాను వణికిస్తున్నా... ముంబైలో ఆ బెడద లేదు. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదు. ఈ సిరీస్‌లోని మూడు మ్యాచ్‌లను తిలకించేందుకు ప్రేక్షకులకు ఉచితంగా మైదానంలోకి అనుమతి ఇస్తున్నారు. 

27  ఓవరాల్‌గా భారత్, ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఇప్పటి వరకు 27 టి20 మ్యాచ్‌లు  జరిగాయి. 7 మ్యాచ్‌ల్లో భారత్‌ గెలుపొందగా... 20 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ విజయం సాధించింది. భారత్‌లో ఈ రెండు జట్ల మధ్య తొమ్మిది మ్యాచ్‌లు జరిగాయి. 2 మ్యాచ్‌ల్లో టీమిండియా, 7 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ గెలిచాయి.   

Advertisement
Advertisement