నేడు దక్షిణాఫ్రికాతో భారత మహిళల రెండో టి20
సాయంత్రం గం. 5:30 నుంచి జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం
డర్బన్: దక్షిణాఫ్రికా పర్యటనను పరాజయంతో ప్రారంభించిన భారత మహిళల క్రికెట్ జట్టు... నేడు రెండో మ్యాచ్ ఆడనుంది. టి20 ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా జరుగుతున్న ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను సమం చేయాలని హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం భావిస్తోంది. శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఓడింది. భారత జట్టు నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
భారత ఇన్నింగ్స్‌లో హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ ఫర్వాలేదనిపించగా... స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, రిచా ఘోష్ విఫలమయ్యారు. ఒక దశలో పటిష్ట స్థితిలో కనిపించిన టీమిండియా... జోరు పెంచాల్సిన దశలో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. అనంతరం బౌలింగ్‌లోనూ ఎలాంటి మ్యాజిక్ చేయలేక ఓటమి వైపు నిలిచింది.
అయితే తొలి మ్యాచ్ లోపాలను సరిదిద్దుకొని ఈ మ్యాచ్‌లో సమష్టిగా సత్తా చాటేందుకు టీమిండియా రెడీ అయింది. బౌలింగ్‌లో తెలుగమ్మాయిలు శ్రీచరణి, అరుంధతి రెడ్డి తొలి మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించగా... వీరితో పాటు సీనియర్ బౌలర్లు దీప్తి శర్మ, రేణుక సింగ్ కలిసికట్టుగా కదంతొక్కాల్సిన అవసరముంది. ఇటీవల ఆ్రస్టేలియా, శ్రీలంకపై టి20 సిరీస్‌లు గెలిచిన టీమిండియా... నెల రోజుల విశ్రాంతి అనంతరం సఫారీ పర్యటనకు వెళ్లింది.
తొలి మ్యాచ్ ఫ్లడ్‌లైట్‌ల వెలుతురులో జరగగా... ఆదివారం ‘డే మ్యాచ్’ నిర్వహించనున్నారు. మరోవైపు గత మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆతిథ్య సఫారీ జట్టు అదే జోరు కొనసాగిస్తూ సిరీస్‌లో మరింత ముందంజ వేయాలని చూస్తోంది. కెప్టెన్ వోల్‌వార్ట్‌తో పాటు, డెర్క్‌సన్, బ్రిట్స్, లుస్ మంచి ఫామ్‌లో ఉన్నారు. సఫారీ బ్యాటర్లను మన బౌలర్లు ఏమాత్రం కట్టడి చేస్తారనే దానిపైనే మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.


