మన గురి అదిరింది! | Indian teams who reached the quarter finals directly in the team categories | Sakshi
Sakshi News home page

మన గురి అదిరింది!

Jul 26 2024 4:30 AM | Updated on Jul 26 2024 4:30 AM

Indian teams who reached the quarter finals directly in the team categories

ర్యాంకింగ్‌ రౌండ్‌లో మెరిసిన భారత ఆర్చర్లు

టీమ్‌ విభాగాల్లో నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ చేరిన భారత జట్లు

అదరగొట్టిన ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ ధీరజ్‌  

పారిస్‌: శుభారంభం లభిస్తే సగం లక్ష్యం నెరవేరినట్లే...! ఒలింపిక్స్‌లో ఎన్నో ఏళ్లుగా భారత్‌ను ఊరిస్తున్న ఆర్చరీ పతకం అందుకునేందుకు మన ఆర్చర్లు సరైన దిశగా అడుగులు వేశారు. గురువారం జరిగిన రికర్వ్‌ విభాగం ర్యాంకింగ్‌ రౌండ్‌లో భారత పురుషుల, మహిళల జట్లు అదరగొట్టాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్లేయర్‌ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్‌ రాయ్, ప్రవీణ్‌ జాధవ్‌లతో కూడిన భారత పురుషుల జట్టు 2013 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది.

ఫలితంగా తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడే అవకాశాన్ని సంపాదించింది. కొలంబియా, టర్కీ జట్ల మధ్య మ్యాచ్‌ విజేతతో క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ తలపడుతుంది. క్వార్టర్‌ ఫైనల్లో నెగ్గితే భారత్‌ సెమీఫైనల్లో ఫ్రాన్స్, ఇటలీ, కజకిస్తాన్‌ జట్లలో ఒక జట్టుతో ఆడుతుంది. 

మరో పార్శ్వంలో దక్షిణ కొరియా, చైనా, జపాన్, మెక్సికో ఉన్నాయి. వ్యక్తిగత విభాగంలో ధీరజ్‌ 681 పాయింట్లతో నాలుగో స్థానాన్ని పొందగా... 674 పాయింట్లతో తరుణ్‌దీప్‌ రాయ్‌ 14వ స్థానంలో, 658 పాయింట్లతో ప్రవీణ్‌ జాధవ్‌ 39వ స్థానంలో నిలిచారు.  

అంకిత భకత్, దీపిక కుమారి, భజన్‌ కౌర్‌లతో కూడిన భారత మహిళల జట్టు ర్యాంకింగ్‌ రౌండ్‌లో 1983 పాయింట్లతో నాలుగో స్థానం దక్కించుకుంది. తద్వారా తొలి రౌండ్‌లో ‘బై’ పొంది నేరుగా క్వార్టర్‌ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్‌ జట్ల మధ్య మ్యాచ్‌ విజేతతో క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ ఆడుతుంది. ఈ అడ్డంకిని భారత్‌ అధిగమిస్తే సెమీఫైనల్లో దక్షిణ కొరియా, అమెరికా, చైనీస్‌ తైపీ జట్లలో ఒక జట్టుతో తలపడుతుంది. ఆదివారం మహిళల మెడల్‌ టీమ్‌ ఈవెంట్, సోమవారం పురుషుల మెడల్‌ టీమ్‌ ఈవెంట్‌  జరుగుతాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement