
కొరియాతో ‘సూపర్–4’ మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న టీమిండియా
రాజ్‌గిర్ (బిహార్): లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకు ఆసియా కప్‌లో తొలిసారి గట్టిపోటీ ఎదురైంది. డిఫెండింగ్ చాంపియన్ దక్షిణ కొరియా జట్టుతో బుధవారం జరిగిన ‘సూపర్–4’ దశ మ్యాచ్‌ను భారత్ 2–2 గోల్స్‌తో ‘డ్రా’గా ముగించింది. మ్యాచ్ ముగియడానికి ఏడు నిమిషాలు ఉన్నాయనగా మన్‌దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌ను ఓటమి బారి నుంచి తప్పించాడు. గోల్స్ చేసేందుకు వచ్చిన పలు అవకాశాలను వృథా చేసుకున్న భారత జట్టు చివరకు విజయం బదులు ‘డ్రా’తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఎనిమిదో నిమిషంలో హార్దిక్ సింగ్ చేసిన గోల్‌తో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే కొరియా జట్టు రెండు నిమిషాల తేడాలో రెండు గోల్స్ చేసి భారత్‌కు షాక్ ఇచి్చంది. 12వ నిమిషంలో జిహున్ యాంగ్ గోల్‌తో స్కోరును 1–1తో సమం చేసిన కొరియా... 14వ నిమిషంలో హైయోన్‌హాంగ్ కిమ్ గోల్‌తో 2–1తో ఆధిక్యంలోకి వెళ్లింది.
ఒకదశలో భారత్‌కు ఓటమి తప్పదేమోనని అనిపించినా... 53వ నిమిషంలో మన్‌దీప్ సింగ్ గోల్ చేసి భారత్‌ను ఆదుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తమకు లభించినా ఆరు పెనాల్టీ కార్నర్‌లను వృథా చేసుకుంది. అంతకుముందు చైనాతో జరిగిన మరో ‘సూపర్–4’ మ్యాచ్‌లో మలేసియా 2–0తో గెలిచింది. నేడు జరిగే మ్యాచ్‌ల్లో కొరియాతో చైనా; మలేసియాతో భారత్ తలపడతాయి.