
ఆస్ట్రేలియా యువ సంచలనం సామ్ కొన్‌స్టాస్ భారత గడ్డపై తన తొలి మ్యాచ్‌లోనే మెరుపు సెంచరీతో కదంతొక్కాడు. 19 ఏళ్ల ఈ ఆసీస్ యువ ఓపెనర్ ప్రస్తుతం ఆస్ట్రేలియా-ఏ జట్టులో భాగంగా భారత్‌లో పర్యటిస్తున్నాడు.
లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత-ఏ జట్టుతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో 122 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తనుశ్ కోటియన్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది మూడంకెల మార్కును తాకాడు. మొత్తంగా 126 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 101 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు.
కొన్‌స్టాస్‌కు జతగా మరో ఓపెనర్ క్యాంప్‌బెల్ కెల్లావే (88) కూడా సెంచరీని సమీపించాడు. కెల్లావే 73 పరుగుల వద్ద ఉండగా.. 56 పరుగుల వద్ద ఉండిన కొన్‌స్టాస్ వేగంగా సెంచరీ పూర్తి చేశాడు.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా-ఏ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. తొలి రోజు టీ విరామం సమయానికి ఆసీస్-ఏ స్కోర్ 198/0గా ఉంది. భారత బౌలర్లు 37 ఓవర్ల పాటు బౌలింగ్ చేసినా ఒక్క వికెట్‌ను కూడా పడగొట్టలేకపోయారు.
టీమిండియాకు ఆడిన అనుభవం ఉన్న బౌలర్లు ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్ కూడా ఈ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. తనుశ్ కోటియన్, హర్ష్ దూబే భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ ఒక్కడే ఆసీస్-ఏ ఓపెనర్లను కాస్త నిలువరించగలిగాడు.
ఈ మ్యాచ్‌లో ఆసీస్-ఏ జట్టుకు నాథన్ మెక్‌స్వీని కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. కొన్‌స్టాస్, జోష్ ఫిలిప్, కూపర్ కన్నోలీ, జేవియర్ బార్ట్‌లెట్, టాడ్ మర్ఫీ లాంటి గుర్తించదగ్గ ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు.
భారత-ఏ జట్టు విషయానికొస్తే.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ వ్యవహరిస్తున్నాడు. అభిమన్యు ఈశ్వరన్, సాయి సుదర్శన్, ఎన్ జగదీషన్, దేవ్‌దత్ పడిక్కల్, ధృవ్ జురెల్, తనుశ్ కోటియన్, హర్ష్ దూబే, ప్రసిద్ద్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్ తుది జట్టులో ఉన్నారు.
ఆస్ట్రేలియా-ఏ జట్టు రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు (నాలుగు రోజుల మ్యాచ్‌లు), మూడు అనధికారిక వన్డేల కోసం భారత్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళే తొలి టెస్ట్ మొదలైంది. రెండో టెస్ట్ కూడా ఎకానా స్టేడియంలోనే సెప్టెంబర్ 23-26 మధ్యలో జరుగతుంది. ఆతర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 3, 5 తేదీల్లో కాన్పూర్‌లో వన్డేలు జరుగుతాయి. ఈ సిరీస్‌ల కోసం భారత-ఏ జట్లను ఇదివరకే ప్రకటించారు.
బుమ్రాతో గొడవతో హైలైటైన కొన్‌స్టాస్
కొన్‌స్టాస్ గతేడాది భారత్‌తో జరిగిన మెల్‌బోర్న్ టెస్ట్‌తో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే అర్ద సెంచరీతో సత్తా చాటిన కొన్‌స్టాస్.. తన రెండో టెస్ట్‌లోనే (సిడ్నీ) టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాతో గొడవపడి మరింత హైలైట్ అయ్యాడు.