ప్రపంచ క్రికెట్‌లో మరో చారిత్రాత్మక ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణకు రంగం సిద్దమవుతోంది. భారత్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఆతిథ్యమిచ్చేందుకు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు పావులు కదపుతోంది. ఇదే విషయంపై ఏసీబీ ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది.
అయితే అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భద్రతా కారణాల వల్ల అక్కడ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడేందుకు ఐసీసీ నుంచి అనుమతి లేదు. దీంతో భారత్‌తో సిరీస్‌ను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నిర్వహించడానికి అఫ్గాన్ క్రికెట్ బోర్డు ప్రణాళికలు రచిస్తోంది. అఫ్గాన్-భారత్ మధ్య టీ20 సిరీస్ ఈ ఏడాది ఆఖరిలో జరిగే అవకాశముంది.
"బీసీసీఐ, ఏసీబీ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఐర్లాండ్, శ్రీలంక, జింబాబ్వే వంటి ఇతర బోర్డులను ఆర్థికంగా ఆదుకోవడానికి బీసీసీఐ భారత జట్టును అక్కడికి పంపించి మ్యాచ్‌లు ఆడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అఫ్గానిస్తాన్‌కు కూడా భారత క్రికెట్ బోర్డు అండగా నిలవనుంది.
ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య దైపాక్షిక టీ20 సిరీస్ నిర్వహణ విషయంలో చర్చలు జరుగుతున్నాయి. ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత దీనిపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. ఈ సిరీస్ కోసం అఫ్ఘనిస్తాన్ జట్టుకు ఢిల్లీని 'హోమ్ గ్రౌండ్' గా కేటాయించనున్నారు.
ఇప్పటికే ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (DDCA) తో బీసీసీఐ చర్చలు జరిపింది. ఇందుకోసం డీడీసీఏ 'ఢిల్లీ ప్రీమియర్ లీగ్ టీ20' షెడ్యూల్‌ను కూడా మార్చుకోవడానికి సిద్ధమైందని" బీసీసీఐ అధికారి ఒకరు టైమ్స్ ఇండియాతో పేర్కొన్నారు. కాగా అఫ్గానిస్తాన్ జట్టు భారత్‌ను తమ హోమ్ గ్రౌండ్‌గా వాడుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలు సిరీస్‌లు ఇండియా వేదికగా జరిగాయి.
భారత్‌లో హోంగ్రౌండ్ అఫ్గానిస్తాన్ ఆడిన సిరీస్‌లు
2017: ఐర్లాండ్‌తో సిరీస్ (గ్రేటర్ నోయిడా)
2018: బంగ్లాదేశ్‌తో సిరీస్ (డెహ్రాడూన్)
2024: న్యూజిలాండ్‌తో ఏకైక టెస్ట్ మ్యాచ్ (గ్రేటర్ నోయిడా)
ఇక హష్మతుల్లా షాహిదీ నేతృత్వంలోని అఫ్గాన్ జట్టు ప్రస్తుతం భారత పర్యటనలో ఉంది. ఈ టూర్‌లో భాగంగా ఆతిథ్య జట్టుతో ఏకైక టెస్ట్‌తో మూడు వన్డేల సిరీస్‌లో అఫ్గాన్ తలపడనుంది. జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్ వేదికగా టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది.


