రోహిత్‌...  ‘ప్రేమ కథా చిత్రం’  | India ODI Captain Rohit Sharma Reveals His Romantic Proposal For Wife | Sakshi
Sakshi News home page

రోహిత్‌...  ‘ప్రేమ కథా చిత్రం’ 

Jun 23 2025 3:09 AM | Updated on Jun 23 2025 3:09 AM

India ODI Captain Rohit Sharma Reveals His Romantic Proposal For Wife

ముంబై: మైదానంలో సహచరులతో సరదాగా ఉంటూ... ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టే భారత వన్డే కెపె్టన్‌ రోహిత్‌ శర్మ... తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అభిమానులకు తెలియని విషయాలు తాజాగా పంచుకున్నాడు. భార్య రితికా సజ్దేకు తొలిసారి తన ప్రేమను వ్యక్త పరిచిన విధానాన్ని వెల్లడించాడు. మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్, గీతా బస్రా దంపతుల యూట్యూబ్‌ చానల్‌లో నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో రోహిత్‌ తన ప్రేమకథను వివరించాడు. 

తాను చిన్నప్పుడు క్రికెట్‌ ఓనమాలు నేర్చుకున్న మైదానంలోని పిచ్‌పై మోకాళ్ల మీద కూర్చొని రితికాకు లవ్‌ ప్రపోజ్‌ చేసినట్లు తెలిపాడు. ‘నా ప్రేవ వ్యక్తీకరణ రొమాంటిక్‌గా జరిగింది. నా కెరీర్‌ ప్రారంభమైన చోటే లవ్‌ ప్రపోజ్‌ చేయాలని నిర్ణయించుకున్నా. అందుకోసం ముందే అంతా సిద్ధం చేసుకున్నా. ఓ సాయంత్రం రితికా నా కోసం ఇంటి నుంచి భోజనం తీసుకొచ్చింది. ఇద్దరం కలిసి మెరీన్‌ డ్రైవ్‌లో కబుర్లు చెప్పుకుంటూ అది లాగించాం. 

ఆ తర్వాత ఐస్‌క్రీమ్‌ తిందామని చెప్పి తనను కారు ఎక్కించుకున్నా. మరీన్‌ డ్రైవ్, హాజీ అలీ, వర్లీ ఇలా ముందుకు వెళ్తుంటే... ఐస్‌క్రీమ్‌ షాప్‌ ఇంకెక్కడుంది అని రితికా ఎదురు ప్రశి్నంచింది. బాంద్రా తప్పించి తనకు ముంబై సిటీ ఎక్కువ తెలియదు. దీంతో బోరీవాలిలో మంచి ఐస్‌క్రీమ్‌ దొరుకుతుందని అబద్ధం చెప్పి తీసుకెళ్లా. కారు ఒక చోట పార్క్‌ చేసి ఆమెను మైదానంలోకి తీసుకెళ్లా. 

అప్పటికే నా స్నేహితులతో చెప్పి కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేయించా. ఆ క్షణాలను ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్‌ చేశా. పిచ్‌ మధ్యకు వెళ్లిన తర్వాత మోకాళ్లపై కూర్చొని తనకు నా ప్రేమను వ్యక్త పరిచా’ అని రోహిత్‌ తన ప్రేమ కథను వివరించాడు. గతేడాది టి20 ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం ఆ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌ శర్మ... ఇటీవల టెస్టు క్రికెట్‌ నుంచి సైతం తప్పుకున్నాడు. ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న హిట్‌మ్యాన్‌... ఐపీఎల్‌ అనంతరం కుటుంబంతో కలిసి గడుపుతున్నాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement