Hardik Pandya: ఓడినా పర్లేదా?! కోహ్లి, రోహిత్‌.. ఇప్పుడు హార్దిక్‌ ఎందుకిలా చేస్తున్నారు? డీకే స్ట్రాంగ్‌ రిప్లై

Ind Vs SL Ajay Jadeja: Why Hardik Wants To Change System DK Reply - Sakshi

Team India Captains: ‘‘కొత్త కెప్టెన్‌ వచ్చిన ప్రతిసారీ.. అంటే కనీసం మూడేళ్లకోసారి జట్టు విధానాలను మార్చేయాలని ఎందుకు కోరుకుంటారు? నాకు తెలిసి విరాట్‌ కోహ్లి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది. కోహ్లి తర్వాత రోహిత్‌.

ఇప్పుడు హార్దిక్‌ పాండ్యా. వీళ్లు టీమిండియా విధానంలో సమూల మార్పులు తేవాలని ఎందుకు కోరుకుంటున్నారో నాకైతే అర్థం కావడం లేదు’’ అని భారత మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా అసహనం వ్యక్తం చేశాడు.

యువ రక్తం
కాగా రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి వంటి సీనియర్ల గైర్హాజరీలో హార్దిక్‌ పాండ్యా సారథ్యంలో టీమిండియా స్వదేశంలో శ్రీలంకతో టీ20 సిరీస్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. ఒకరిద్దరు మినహా అంతా యువ ప్లేయర్లే జట్టులో ఉండటం విశేషం.

ఇక వాంఖడేలో జరిగిన తొలి టీ20లో పేసర్‌ శివం మావి అరంగేట్రం చేయగా.. సంజూ శాంసన్‌ గాయం కారణంగా దూరమైన నేపథ్యంలో రెండో మ్యాచ్‌లో రాహుల్‌ త్రిపాఠి టీమిండియా క్యాప్‌ అందుకున్నాడు. ఇక ప్రస్తుత జట్టులో ఒకరిద్దరు సీనియర్లు మినహా అంతా యువకులే ఉన్నారన్న సంగతి తెలిసిందే.

ఓడినా పర్లేదా?!
ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా ప్రయోగాలకు వెనుకాడటం లేదు. అంతేకాదు.. మొదటి మ్యాచ్‌ తర్వాత.. ‘‘ఓడిపోయినా పర్లేదు గానీ, కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో వాళ్లు తెలుసుకోవాలి. అందుకే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నెట్టేశా’’ అంటూ పాండ్యా వ్యాఖ్యానించాడు. మేజర్‌ టోర్నీల్లో ఒత్తిడిని అధిగమించడం అలవాటు కావడం కోసం చివరి ఓవర్‌ను అక్షర్‌ చేత వేయించానని చెప్పుకొచ్చాడు.

అయితే, వాంఖడేలో 2 పరుగుల తేడాతో విజయం సాధించినా.. పుణెలో మాత్రం 16 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచినప్పటికీ బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్‌పై హార్దిక్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకోవడం విశేషం.

ఇంతకు ముందున్న వాళ్ల సంగతి?
ఈ నేపథ్యంలో క్రిక్‌బజ్‌ షో చర్చలో అజయ్‌ జడేజా మాట్లాడుతూ.. ‘‘కొత్తగా కెప్టెన్‌ అయిన ప్రతి ఒక్కరు పాత విధానాన్ని మార్చాలని చూస్తూనే ఉన్నారెందుకు? ఇంతకు ముందున్న వాళ్ల కెప్టెన్సీ సరిగ్గా లేదా ఏంటి?’’ అని ప్రశ్నించాడు.

ఇందుకు స్పందించిన వెటరన్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్‌.. ‘‘గత కెప్టెన్ల నేతృత్వంలో ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా విఫలమైంది. అందుకే కొత్త విధానాలు అమలు చేయాలని భావిస్తున్నారు’’ అని పేర్కొన్నాడు. కోహ్లి, రోహిత్‌ కెప్టెన్సీలో టీమిండియా ఒక్క మేజర్‌ టోర్నీ కూడా గెలవలేదన్న విషయం తెలిసిందే.

మార్పు అనివార్యం, తథ్యం
ఇదిలా ఉంటే.. కాగా రెండో టీ20లో యువ బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చుకోవడంతో లంక భారీ స్కోరు చేసింది. కానీ, లంక బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో పరాభవం తప్పలేదు. ఈ క్రమంలో హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ స్పందిస్తూ.. యువ జట్టు తప్పులను కాయాలని, మార్పులు జరుగుతున్న తరుణంలో అందరూ కాస్త ఓపికగా ఉండాలన్నాడు. దీనిని బట్టి వచ్చే వరల్డ్‌కప్‌ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామనే సంకేతాలు ఇచ్చాడు.

చదవండి: ODI World CUP 2023: టీమిండియాకు బ్యాడ్‌ న్యూస్‌.. వన్డే వరల్డ్‌కప్‌కు పంత్‌ దూరం!
Rahul Tripathi: వైరల్‌.. అవుటా? సిక్సరా? ఏంటిది?.. పాపం అక్షర్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top