Ind vs SA: నిన్న సిరాజ్‌.. నేడు బుమ్రా.. ఉతికి ‘ఆరే’శారు | Ind vs SA 2nd Test Day 2: Bumrah Takes 4 Wickets Early Video | Sakshi
Sakshi News home page

Ind vs SA: నిన్న సిరాజ్‌.. నేడు బుమ్రా.. ఉతికి ‘ఆరే’శారు

Jan 4 2024 2:21 PM | Updated on Jan 4 2024 4:43 PM

Ind vs SA 2nd Test Day 2: Bumrah Takes 4 Wickets Early Video - Sakshi

సౌతాఫ్రికా- టీమిండియా మధ్య రెండో టెస్టు రెండో రోజు ఆట మొదలైంది. కేప్‌టౌన్‌ వేదికగా 63/3(17) ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ప్రొటిస్‌ జట్టుకు భారత పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా చుక్కలు చూపిస్తున్నాడు. 

ఈ స్పీడ్‌స్టర్‌ దాటికి సౌతాఫ్రికా మొదటి సెషన్‌లోనే నాలుగు వికెట్లు కోల్పోయింది. గురువారం నాటి ఆటలో భాగంగా తొలి ఓవర్లోనే డేవిడ్ బెడింగ్‌హామ్‌ను పెవిలియన్‌కు పంపాడు బుమ్రా. 17.6వ ఓవర్‌ వద్ద 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న సమయంలో బెడింగ్‌హామ్‌ రాహుల్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

ఆ మరుసటి నాలుగో ఓవర్లో బుమ్రా మరోసారి తన బౌలింగ్‌ పదును రుచి చూపించాడు. 21.1 ఓవర్‌ వద్ద కైలీ వెరెనె(9) వికెట్‌ పడగొట్టాడు. ఆ తర్వాత మళ్లీ 23.5వ ఓవర్‌ వద్ద మార్కో జాన్సెన్‌ను అద్భుత రీతిలో బౌల్డ్‌ చేశాడు బుమ్రా. తద్వారా రెండో రోజు తొలి సెషన్‌లోనే మూడో వికెట్‌ కూడా దక్కించుకున్నాడు.

ఆ తర్వాత కేశవ్‌ మహరాజ్‌ను పెవిలియన్‌కు పంపి నాలుగో వికెట్‌ తన ఖాతాలో జమ చేసుకున్నాడు. ఇక మొదటి రోజు ఆటలో భాగంగా బుమ్రా ట్రిస్టన్‌ స్టబ్స్‌ను అవుట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఇప్పటికే ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయడం విశేషం.

ఇదిలా ఉంటే.. బుమ్రా ధాటికి 117 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికా.. 176 పరుగుల వద్ద ఆలౌట్‌ అయింది. సెంచరీ హీరో ఐడెన్‌ మార్క్రమ్‌ వికెట్‌ను మహ్మద్‌ సిరాజ్‌ దక్కించుకోగా.. ప్రసిద్‌ కృష్ణ ఒక వికెట్‌ తీశాడు.

ఆఖర్లో బుమ్రా తన ఆరో వికెట్‌గా లుంగి ఎంగిడిని పెవిలియన్‌కు పంపి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. ఇక సౌతాఫ్రికాను తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌట్‌ చేయడంలో సిరాజ్‌ ఆరు వికెట్లతో కీలక పాత్ర పోషించగా.. రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా ఆరేయడం(ఆరు వికెట్లు తీయడం) విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement