టీమిండియా మూడోసారి..

Ind Vs Eng: India Winning A Series After Being First Test Loss - Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌ను టీమిండియా 3-1 తేడాతో గెలిచి డబ్యూటీసీ ఫైనల్లో అడుగుపెట్టింది. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాల్గో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్‌ 25 పరుగుల తేడాతో గెలిచింది. ఫలితంగా హ్యాట్రిక్‌ విజయాలతో వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ తుది బెర్తును ఖాయం చేసుకుంది. ఇప్పటికే న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరగా, తాజా విజయంతో టీమిండియా సైతం తుది పోరుకు అర్హత సాధించింది. కాగా, తొలి టెస్టులో ఓటమి తర్వాత పుంజుకున్న టీమిండియా వరుస విజయాలతో ఫైనల్‌కు చేరడం విశేషం. అయితే ఇలా నాలుగు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైన తర్వాత టీమిండియా సిరీస్‌ను గెలవడం ఇది మూడోసారి.  ఇక్కడ చదవండి: టీమిండియా విజయం.. సగర్వంగా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు

2016-17 సీజన్‌లో ఆసీస్‌తో జరిగిన సిరీస్‌లో కూడా టీమిండియా ఇలానే తొలి టెస్టులో ఓటమి పాలైన తర్వాత సిరీస్‌ను దక్కించుకుంది. ఆ నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-1తో దక్కించుకుంది. మళ్లీ 2020-21 సీజన్‌లో భాగంగా  ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కూడా టీమిండియా మొదటి మ్యాచ్‌లో పరాజయం చవిచూసి ఆపై సిరీస్‌ను 2-1 తో గెలుచుకుంది. ఇప్పుడు ఇంగ్లండ్‌పై 3-1తో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఓవరాల్‌గా చూస్తే టీమిండియా తొలి టెస్టులో ఓటమి పాలైన తర్వాత సిరీస్‌ను దక్కించుకున్న సందర్బాలు 1972 నుంచి ఇప్పటివరకూ ఆరోసారి మాత్రమే. 1972-73 సీజన్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల  సిరీస్‌ను టీమిండియా 2-1తో సాధించింది. ఆపై 2000-01 సీజన్‌లో​ ఆసీస్‌తో​ జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలుచుకుంది. అటు తర్వాత 2015లో శ్రీలంకతో​ జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలుచుకుంది. ఇవన్నీ తొలి టెస్టులో టీమిండియా ఓటమి పాలైన తర్వాత సిరీస్‌ను గెలుచుకున్న సందర్భాలు. 

ఇదిలా ఉంచితే, ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇంగ్లండ్‌ 135 పరుగులకు ఆలౌట్‌ అయింది.  దీంతో టీమిండియాకు ఇన్నింగ్స్‌ విజయం లభించింది. అక్షర్‌ పటేల్, అశ్విన్‌ చెరో‌ 5 వికెట్లతో ఇంగ్లండ్‌ నడ్డి విరిచి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌ను టీమిండియా కైవసం​ చేసుకుని  జూన్‌లో లార్డ్స్‌ వేదికగా జరగనున్న ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడటానికి సిద్ధమైంది.   ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకు ఆలౌట్‌ అయింది.

ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్లలో స్టోక్స్‌(55 పరుగులు) మినహా మరెవరు రాణించలేకపోయారు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఒక దశలో 143 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి ఇంగ్లండ్‌ స్కోరును సమం చేస్తుందా అన్న అనుమానం రేకెత్తించింది. అయితే పంత్‌- సుందర్‌ల సెంచరీ భాగస్వామ్యం తర్వాత సుందర్‌- అక్షర్‌ల మరో సెంచరీ భాగస్వామ్యం సాధించడంతో టీమిండియాను పట్టు బిగించింది. రెండో ఇన్నింగ్స్‌ లో పంత్‌ సూపర్‌ సెంచరీ(101 పరుగులు).. సుందర్‌ 96 నాటౌట్‌.. అక్షర్‌ పటేల్‌ 43 పరుగులతో రాణించడంతో టీమిండియా 365 పరుగులకు ఆలౌట్‌ అయింది.  టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 160 పరుగుల ఆధిక్యం సంపాదించినట్లయింది.కాగా, ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 135 పరుగులకే కుప్పకూలడంతో భారత్‌కు ఇన్నింగ్స్‌ విజయం దక్కింది. ఇక్కడ చదవండి: ఐపీఎల్‌ షెడ్యూల్‌ ఇదేనా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top