Sarfaraz Khan: .. మాట నిలబెట్టుకున్న మహీంద్రా

Ind vs Eng Anand Mahindra Fulfills Promise Gifts This To Sarfaraz Khan Father - Sakshi

టీమిండియా తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన బ్యాటర్లలో ఒకడిగా పేరొందాడు సర్ఫరాజ్‌ ఖాన్‌. రంజీల్లో పరుగుల వరద పారించినా.. భారత జట్టులో చోటు కోసం మాత్రం సుదీర్ఘకాలం ఎదురుచూడాల్సి వచ్చింది ఈ ముంబై ప్లేయర్‌కి!

అయితేనేం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సర్ఫరాజ్‌.. మెరుపు అర్ధ శతకం సాధించాడు.

తద్వారా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి తానేంటో నిరూపించుకున్నాడు. ఇక సర్ఫరాజ్‌ ఖాన్‌కు తన తండ్రి నౌషద్‌ ఖాన్‌ కోచ్‌, మెంటార్‌ అన్న విషయం తెలిసిందే. అరంగేట్రం సందర్భంగా టీమిండియా క్యాప్‌ను ముద్దాడి పుత్రోత్సాహంతో పొంగిపోయాడు నౌషద్‌. కుమారుడి కోసం తాను చేసిన త్యాగాలు ఫలించినందుకు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.

ఇంత గొప్ప వ్యక్తికి బహుమతిగా
ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరి మనసును మెలిపెట్టగా.. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర సైతం ఉద్వేగానికి లోనయ్యారు. ‘‘ఎప్పుడూ ధైర్యం కోల్పోకూడదు. కఠిన శ్రమ, ఓపిక ఉండాలి.

తండ్రి కంటే తన పిల్లలను ఇంత బాగా ఇన్‌స్పైర్‌ చేయగల వ్యక్తి ఎవరు ఉంటారు? అలాంటి గొప్ప వ్యక్తి నౌషద్‌ ఖాన్‌.. ఆయన గనుక ఒప్పుకొంటే.. మహీంద్రా థార్‌తో సత్కరించాలనుకుంటున్నా’’ అని బహుమతి ప్రకటించారు.

తాజాగా తన మాట నిలబెట్టుకున్నారు ఆనంద్‌ మహీంద్ర. సర్ఫరాజ్‌ ఖాన్‌ టెస్టు అరంగేట్రం సందర్భంగా చెప్పినట్లుగా నౌషద్‌ ఖాన్‌కు మహీంద్రా కారును అందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున మూడు టెస్టులు ఆడిన సర్ఫరాజ్‌ ఖాన్‌ 200 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఇక సర్ఫరాజ్‌ ప్రతిభను గుర్తించిన బీసీసీఐ ఇటీవలే అతడికి సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాలో చేర్చింది. గ్రేడ్‌- సీ ప్లేయర్‌గా సర్ఫరాజ్‌ ఖాన్‌కు అవకాశమిచ్చింది.

చదవండి: #Kohli: ఇలాంటి ప్రవర్తన అస్సలు ఊహించలేదు.. నీ స్థాయికి ఇది తగునా కోహ్లి?

Election 2024

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top