Ind Vs Eng: Ajay Jadeja Questions Rohit Sharma Captaincy T20 WC Exit - Sakshi
Sakshi News home page

Rohit Sharma: నా మాటలు రోహిత్‌ను బాధించవచ్చు.. ఇంతకీ అతడు: భారత మాజీ క్రికెటర్‌

Published Fri, Nov 11 2022 6:49 PM

Ind Vs Eng: Ajay Jadeja Questions Rohit Sharma Captaincy T20 WC Exit - Sakshi

ICC Men's T20 World CUp 2022- Rohit Sharma: టీ20 ప్రపంచకప్‌-2022 నుంచి టీమిండియా నిష్క్రమణ నేపథ్యంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో బ్యాటర్‌గా.. కెప్టెన్‌గా విఫలమయ్యాడంటూ ‘హిట్‌మ్యాన్‌’ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐపీఎల్‌ టైటిళ్లు గెలిస్తే సరిపోదని.. ఐసీసీ ట్రోఫీ గెలిస్తేనే విజయవంతమైన కెప్టెన్‌ అంటారంటూ ట్రోల్‌ చేస్తున్నారు.

అదే విధంగా పలు సిరీస్‌లకు రోహిత్‌ అందుబాటులో ఉండని విషయాన్ని ఉటంకిస్తూ.. విశ్రాంతి తీసుకుని తీసుకుని రోహిత్‌ అలసిపోయాడని.. ఫామ్‌లో ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మ్యాచ్‌లు ఆడాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా సైతం రోహిత్‌ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అదే విధంగా తరచూ కెప్టెన్లను మారుస్తున్న భారత క్రికెట్‌ నియంత్రణ మండలి తీరును ఎండగట్టాడు.

వరల్డ్‌కప్‌ రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌ చేతిలో టీమిండియా ఘోర పరాభవం నేపథ్యంలో క్రిక్‌బజ్‌తో మాట్లాడిన అజయ్‌ జడేజా.. ‘‘నేను చెప్పే మాటలు రోహిత్‌ శర్మకు బాధ కలిగించవచ్చు. నిజానికి కెప్టెన్‌గా జట్టును తీర్చిదిద్దుకోవాలంటే కనీసం ఏడాది పాటు టీమ్‌ను అట్టిపెట్టుకునే ఉండాలి.

అసలు ఈ ఏడాదిలో రోహిత్‌ ఎన్ని సిరీస్‌లు ఆడాడు? జట్టుకు నాయకుడు అనేవాడు ఒక్కడే ఉండాలి. ఏడుగురు కెప్టెన్లు ఉంటే కీలక సమయాల్లో గెలుపొందడం కష్టమే’’ అంటూ బీసీసీఐపై విమర్శలు గుప్పించాడు. ఇక న్యూజిలాండ్‌ టూర్‌కు హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రావిడ్‌కు రెస్ట్‌ ఇవ్వనున్నారన్న వార్తల నేపథ్యంలో జట్టులో అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదని వాపోయాడు.

కోహ్లి నిష్క్రమణ తర్వాత కెప్టెన్ల మార్పులు
గతేడాది టీ20 ప్రపంచకప్‌-2021 తర్వాత విరాట్‌ కోహ్లి పొట్టి ఫార్మాట్‌ కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌తో సారథిగా బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ.. వెస్టిండీస్‌, శ్రీలంక తదితర జట్లపై క్లీన్‌స్వీప్‌లతో సత్తా చాటాడు.

ఇక వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లిని తప్పించిన తర్వాత పరిమత ఓవర్ల క్రికెట్‌ పూర్తిస్థాయి కెప్టెన్‌గా మారాడు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల రోహిత్‌ జట్టుకు దూరంకాగా కేఎల్ రాహుల్ (సౌతాఫ్రికాతో వన్డేలు, రిషభ్ పంత్ (సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌), హార్ధిక్ పాండ్యా (ఐర్లాండ్‌లో టీ20 సిరీస్‌), జస్ప్రీత్ బుమ్రా (ఇంగ్లండ్ తో రీషెడ్యూల్ 5వ టెస్ట్), శిఖర్ ధవన్ (వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌) తదితరులు సారథులుగా వ్యవహరించారు. ఇలా ఏడాదిలో ఏడుగురు కెప్టెన్లను మార్చిన జట్టుగా టీమిండియా ‘రికార్డు’ సృష్టించింది. 

కాగా ఐపీఎల్‌లో ఐదు టైటిళ్లు గెలవడం సహా ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలతో కెప్టెన్‌గా హిట్‌ అయిన హిట్‌మ్యాన్‌.. ఆసియా కప్‌-2022 టీ20 టోర్నీ, తాజాగా టీ20 ప్రపంచకప్‌-2022 ఈవెంట్‌లో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. మేజర్‌ టోర్నీల్లో పూర్తిగా నిరాశపరిచాడు. ఇక ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఆసియా కప్‌లో 133, వరల్డ్‌కప్‌లో 116 పరుగులు మాత్రమే చేశాడు. 

చదవండి: Alex Hales-Eoin Morgan: కాలం ఒకేలా ఉండదు.. తిట్టినోడే చప్పట్లతో మెచ్చుకున్నాడు
WC 2022 Final: రూ. 500కే ఫైనల్‌ టిక్కెట్లు అమ్మేసిన ఫ్యాన్స్‌!? ఇది వాళ్ల పనేనంటూ
T20 WC 2022: 'అతడిని టీమిండియా కోచ్‌ చేయండి.. కెప్టెన్‌గా అతడే సరైనోడు'

Advertisement
Advertisement