
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లండ్ మీద తొలి ఇన్నింగ్స్‌లో 373 పరుగుల ఆధిక్యం సంపాదించిన భారత్.. ఆతిథ్య జట్టుకు 374 పరుగుల లక్ష్యం విధించింది.
టీమిండియా బ్యాటర్లలో ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతకం (118)తో చెలరేగితే.. ఆకాశ్ దీప్ (66), రవీంద్ర జడేజా (53) హాఫ్ సెంచరీలతో అలరించారు. వీరికి తోడు వాషింగ్టన్ సుందర్ మెరుపు అర్ధ శతకం (46 బంల్లో 53)తో అదరగొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్ ఐదు వికెట్లు తీయగా.. గస్ అట్కిన్సన్ 3, జేమీ ఓవర్టన్ రెండు వికెట్లు పడగొట్టారు.
అదరగొట్టిన భారత బ్యాటర్లు
ఇంగ్లండ్‌తో ఐదో టెస్టు మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు ఆకట్టుకున్నారు. ఫలితంగా 87 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 396 పరుగులు చేసి.. ఇంగ్లండ్ కంటే 373 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్- ఇంగ్లండ్ మధ్య గురువారం నిర్ణయాత్మక ఐదో టెస్టు మొదలైన విషయం తెలిసిందే. లండన్‌లో ఓవల్ మైదానంలో టాస్ గెలిచిన ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
అయితే, తొలి ఇన్నింగ్స్ ఆరంభం నుంచే తడబడ్డ గిల్ సేన 69.4 ఓవర్లలో 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (2), కేఎల్ రాహుల్ (14) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ 38 పరుగులు చేయగలిగాడు.
మిగతా వాళ్లలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (21), రవీంద్ర జడేజా (9), ధ్రువ్ జురెల్ (19) విఫలం కాగా.. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు రాబట్టాడు. ఇక ఐదో నంబర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఒక్కడే అర్ధ శతకం (57)తో రాణించాడు.. అతడి ఇన్నింగ్స్ కారణంగానే భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. ఇక టెయిలెండర్లలో ఆకాశ్ దీప్ (0) నాటౌట్‌గా నిలవగా.. మహ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ డకౌట్‌గా వెనుదిరిగారు.
ఇంగ్లండ్ బౌలర్లలో గస్ అట్కిన్సన్ ఐదు వికెట్లతో చెలరేగగా.. జోష్ టంగ్ మూడు, క్రిస్ వోక్స్ ఒక వికెట్ దక్కించుకున్నారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్లు జాక్ క్రాలే (64), బెన్ డకెట్ (43)తో పాటు హ్యారీ బ్రూక్ (53) రాణించాడు.
భారత బౌలర్లలో సిరాజ్, ప్రసిద్ నాలుగేసి వికెట్లు కూల్చగా.. ఆకాశ్ దీప్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. ఇంగ్లండ్ టెయిలెండర్ క్రిస్ వోక్స్ ఆబ్సెంట్‌హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో శుక్రవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్.. రెండు వికెట్ల (కేఎల్ రాహుల్-7, సాయి సుదర్శన్- 11) నష్టానికి 75 పరుగులు చేసింది.
వీలుచిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూ
ఈ క్రమంలో 75/2 ఓవర్‌నైట్ స్కోరుతో శనివారం నాటి మూడో రోజు ఆట మొదలుపెట్టిన టీమిండియా పటిష్ట స్థితిలో నిలిచింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ శతక్కొట్టగా (118), నైట్ వాచ్‌మన్‌గా వచ్చిన పేసర్ ఆకాశ్ దీప్ సంచలన అర్ధ శతకం (66) సాధించాడు.
ఇక కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (11) మరోసారి నిరాశపరచగా.. కరుణ్ నాయర్ (17) కూడా విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్ (46 బంతుల్లో 34) వేగంగా ఆడే ప్రయత్నం చేసి జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
మరోవైపు.. అర్ధ శతకంతో ఆకట్టుకున్న రవీంద్ర జడేజా (53)ను జడేజా జోష్ టంగ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్‌కు క్యాచ్ ఇచ్చి.. ఎనిమిదో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. జడ్డూ అవుటయ్యే సరికి అంటే.. 83.2 ఓవర్లలో టీమిండియా 357 పరుగులు చేసింది.
తద్వారా ఇంగ్లండ్ కంటే 334 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. జడ్డూ స్థానంలో క్రీజులోకి వచ్చిన సిరాజ్ డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో బాధ్యత తన మీద వేసుకున్న వాషింగ్టన్ సుందర్ వీలుచిక్కినప్పుడల్లా సిక్సర్లు బాదుతూ.. అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 39 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు.