IND v SL 2023: విరామం... విశ్రాంతి... వేటు..! బీసీసీఐకి ఇదేం కొత్త కాదు!

IND v SL 2023: India squad for Mastercard Sri Lanka tour of India announced - Sakshi

బీసీసీఐకి ఇది కొత్త కాదు... ఏదైనా సిరీస్‌ కోసం జట్టును దాదాపు అర్ధరాత్రి సమయంలో ప్రకటించడమే కాదు... పేర్లు మినహా ఎంపిక గురించి కనీసం ఏకవాక్య సమాచారం కూడా ఇవ్వకపోవడం రివాజుగా మారింది. ఫలానా ఆటగాడిపై వేటు వేశామనో, ఫిట్‌నెస్‌ లేదనో, లేదంటే విశ్రాంతినిచ్చామనో, లేదా ఆటగాడు కోరుకుంటే విరామం ఇచ్చామనో ఏమీ ఉండదు...

తగిన కారణం లేకుండా ఆటగాళ్లు పేర్లు మాత్రం మారిపోతాయి. మరో వైపు ఉద్వాసనకు గురైన సెలక్షన్‌ కమిటీతోనే కొత్త జట్లను కూడా ఎంపిక చేయించడం కూడా ఆశ్చర్యం కలిగించే అంశం. ఈ నేపథ్యంలో తాజాగా శ్రీలంకతో సిరీస్‌లకు ప్రకటించిన జట్లను విశ్లేషిస్తే...

వచ్చే ఏడాది స్వదేశంలోనే వన్డే ప్రపంచకప్‌ జరుగనున్న నేపథ్యంలో సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ కీలక ఆటగాళ్లపై ఒత్తిడి తగ్గించే నిర్ణయాలే తీసుకుంది. అందువల్లే రోహిత్, కోహ్లి, రిషభ్‌ పంత్, బుమ్రా, రాహుల్‌లను ఎంపిక చేసే విషయంలో జాగ్రత్తలు తీసుకుంది. అందులో కొందరిని టి20లకు తీసుకుంటే... మరికొందరిని వన్డేలకు ఎంపిక చేసింది.

బుమ్రాలాంటి ఆటగాడిని ప్రపంచకప్‌ దృష్టితో చూసి ఏ సిరీస్‌కూ ఎంపిక చేయలేదు. నిజానికి అతను ఫిట్‌గానే ఉన్నాడు. అయితే తొందరపడి వెంటనే అంతర్జాతీయ క్రికెట్‌ బరిలో ఇప్పుడపుడే దింపకూడదని  సెలక్టర్లు భావించారు. బంగ్లాలో గాయపడిన రోహిత్‌ ప్రస్తుతం కోలుకున్నాడు.

నెట్‌ ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. ఇంకో వారం, పదిరోజుల్లో అతను పూర్తి ఫిట్‌నెస్‌ సంతరించుకుంటాడు. అందువల్లే అతన్ని వన్డేలకు ఎంపిక చేశారు. మాజీ కెప్టెన్, స్టార్‌ బ్యాటర్‌ కోహ్లి, కేఎల్‌ రాహుల్‌ విశ్రాంతి కోరకపోయినప్పటికీ సెలక్టర్లే టి20లకు రెస్ట్‌ ఇచ్చి వన్డే జట్టులోకి తీసుకున్నారు. బుమ్రాను ప్రపంచకప్‌ దృష్టితో చూసినట్టే... రిషభ్‌ పంత్‌ను సొంతగడ్డపై ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌ కోసం బ్రేక్‌ ఇచ్చారు.

కంగరూతో సిరీస్‌లో కీలకపాత్ర పోషించగలడని భావిస్తున్న పంత్‌ను కండిషనింగ్‌ క్యాంపునకు పంపారు. ఈ ఏడాది అతను అన్ని ఫార్మాట్లలో కలిపి 44 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. బిజీ షెడ్యూలు నుంచి కాస్త తెరిపినివ్వాలనే ఉద్దేశంతోనే అతన్ని బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీకి పంపారు.

జడేజా విషయానికి వస్తే ముందుగా అతని మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను పరిశీలించాకే జాతీయ జట్టులోకి తీసుకోవాలని సెలక్షన్‌ కమిటీ భావించింది. గత సీజన్‌లో పేస్‌ బౌలింగ్‌తో ఆకట్టుకున్న ప్రసిధ్‌ కృష్ణ, ఆల్‌రౌండర్‌ దీపక్‌ చహర్‌ గాయాల నుంచి ఇంకా వంద శాతం కోలుకోలేదు. సీనియర్‌ సీమర్‌ భువనేశ్వర్‌ను అసలు పరిశీలించలేదు. దీంతో వచ్చే ప్రపంచకప్‌లో ఆడే టీమిండియా జట్టులో భువనేశ్వర్‌ భాగంగా లేడని సెలక్టర్లు సంకేతాలు ఇచ్చినట్లయింది.

స్పిన్నర్లలో అనుభవజ్ఞుడైన చహల్‌పైనే సెలక్టర్లు  నమ్మకముంచారు. దీంతో రవి బిష్ణోయ్‌కి అవకాశం లేకపోయింది. స్టార్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్, హైదరాబాద్‌ పేసర్‌ సిరాజ్‌లు ఫామ్‌లోనే ఉన్నారు. వారి ఆటతీరుపై సెలక్టర్లకు అసంతృప్తి ఏమీ లేదు... కానీ పొట్టి సిరీస్‌కు మాత్రం వీళ్లిద్దరికి విశ్రాంతినిచ్చింది.  

భావి కెప్టెన్‌ అంచనాలతో...
హార్దిక్‌ పాండ్యా నాయకత్వ సత్తా ఏంటో ఐపీఎల్‌లో ఒకే ఒక్క సీజన్‌తో చాటిచెప్పాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ గైర్హాజరీలోనూ పగ్గాలు చేపట్టి జట్టును నడిపించాడు. ఈ నేపథ్యంలో భావి కెప్టెన్‌ అంచనాలున్న ఆల్‌రౌండర్‌ పాండ్యాకు జట్టులో ఒక రకంగా పూర్తి స్థాయి వైస్‌ కెప్టెన్సీతో పదోన్నతి ఇచ్చారు.

టాపార్డర్‌లో ఇటీవల మంచి అవకాశాలు కల్పించినప్పటికీ పేలవమైన ఆటతీరు కనబరిచిన ధావన్‌పై సెలక్టర్లు వేటు వేశారు. ఇషాన్‌ కిషన్, శుబ్‌మన్‌ గిల్‌లాంటి ప్రతిభావంతులు నిలకడగా రాణిస్తుండటంతో ఇక ధావన్‌ ఆటకు తెరపడినట్లే భావించవచ్చు.
-సాక్షి క్రీడా విభాగం
చదవండి: సిరీస్‌ ఓటమిపై బీసీబీ ఆగ్రహం.. ఉన్నపళంగా రాజీనామా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top