
లంక కెప్టెన్ చమరి ఆటపట్టుతో ఆసీస్ సారథి అలిసా హేలీ కరచాలనం (PC: ICC)
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మహిళల వన్డే ప్రపంచకప్ (ICC Womens World Cup 2025)ను వరుణుడు వీడటం లేదు. ఇప్పటికే పలు మ్యాచ్‌లకు స్వల్పంగా ఆటంకం కలిగించిన వర్షం... శనివారం పూర్తి మ్యాచ్‌ను తుడిచిపెట్టేసింది. కొలంబో వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా- శ్రీలంక ( Sri Lanka W vs Australia W) మధ్య జరగాల్సిన మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దు అయింది.
మ్యాచ్ సమయం కంటే ముందు నుంచే భారీ వర్షం ముంచెత్తడంతో... కనీసం టాస్ కూడా వేసే అవకాశం దక్కలేదు. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. వరల్డ్‌కప్‌లో భాగంగా నేడు దాయాది పాకిస్తాన్‌తో భారత మహిళల జట్టు తలపడనుంది.
ఇదీ చదవండి: ఒంటిచేత్తో ఆసీస్‌ను గెలిపించిన మార్ష్
మౌంట్ మాంగనీ: మిచెల్ మార్ష్ (52 బంతుల్లో 103 నాటౌట్; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగడంతో న్యూజిలాండ్‌పై మూడో టీ20లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల ‘చాపెల్–హ్యాడ్లీ’ సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన ఆఖరి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో ఆతిథ్య న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. తద్వారా 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది.
తొలి మ్యాచ్‌లో మార్ష్ మెరుపులతో ఆసీస్ అలవోకగా గెలవగా... రెండో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయింది. అంతర్జాతీయ టి20ల్లో మార్ష్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది.
వికెట్ కీపర్ టిమ్ సైఫెర్ట్ (35 బంతుల్లో 48; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... కెప్టెన్ మిచెల్ బ్రేస్‌వెల్ (22 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్), నీషమ్ (18 బంతుల్లో 25; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు.
గత మ్యాచ్ సెంచరీ హీరో టిమ్ రాబిన్‌సన్ (13) ఈ సారి విఫలం కాగా... డెవాన్ కాన్వే (0), మార్క్ చాప్‌మన్ (4), డారిల్ మిచెల్ (9) ప్రభావం చూపలేకపోయారు. ఆస్ట్రేలియా బౌలర్లలో సీన్ అబాట్ 3 వికెట్లు పడగొట్టగా... జోష్ హాజిల్‌వుడ్, జేవియర్ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు.
అనంతరం లక్ష్యఛేదనలో మార్ష్ మెరుపులు మెరిపించడంతో ఆ్రస్టేలియా 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. మిగిలిన వాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోగా, మార్ష్ ఒంటి చేత్తో జట్టును విజయపథాన నడిపాడు.
ట్రావిస్ హెడ్ (8), మాథ్యూ షార్ట్ (7), టిమ్ డేవిడ్ (3), అలెక్స్ కారీ (1)మార్కస్ స్టొయినిస్ (2) పేలవ ప్రదర్శన కనబర్చారు. మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడుతున్నా... మార్ష్ ఏమాత్రం వెరవకుండా భారీ షాట్‌లతో విరుచుకుపడ్డాడు.
ఈ క్రమంలో అతడు 50 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో 73 ఇన్నింగ్స్‌లు ఆడిన మార్ష్‌కు ఇదే తొలి మూడంకెల స్కోరు. న్యూజిలాండ్ బౌలర్లలో నీషమ్ 4 వికెట్లు పడగొట్టాడు. మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి.