ICC Men's ODI Rankings: నానాటికి దిగజారుతున్న కోహ్లి ర్యాంక్‌.. ఏడేళ్లలో తొలిసారి ఈ దుస్థితి..!

ICC ODI Rankings: Shreyas Iyer, Shikhar Dhawan Move Up While Rohit Sharma, Virat Kohli Lose Their Spot - Sakshi

Virat Kohli: ఐసీసీ తాజాగా (జులై 27) విడుదల చేసిన పురుషుల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరింత దిగజారాడు. గడిచిన ఏడేళ్లలో ఎన్నడూ లేనంత కింది ర్యాంక్‌కు రన్‌మెషీన్‌ పడిపోయాడు. తాజా ర్యాంకింగ్స్‌లో 5వ స్థానానికి (744 రేటింగ్‌ పాయింట్లు) దిగజారిన కోహ్లి.. 2015 అక్టోబర్‌ తర్వాత టాప్‌-4 ర్యాంకింగ్స్‌లో నుంచి బయటికి వచ్చాడు. గత దశాబ్ద కాలం పాటు వన్డేల్లో మకుటం లేని మారాజుగా చలామణి అయిన కోహ్లి.. ఇటీవలి కాలంలో ఈ ఫార్మాట్‌లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడకుండా ఈ దుస్థితి తెచ్చుకున్నాడు. రెస్ట్‌ పేరుతో ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా అతను డుమ్మా కొట్టాడు. 

కోహ్లి పరిస్థితి ఇలా ఉంటే, తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ కూడా ఓ స్థానాన్ని కోల్పోయి 6వ ప్లేస్‌కు పడిపోయాడు. మరోవైపు విండీస్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన టీమిండియా తాత్కాలిక కెప్టెన్‌ శిఖర్‌ ధవన్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. తొలి వన్డేలో 3 పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్న ధవన్‌ ఓ స్థానం మెరుగుపర్చుకుని 13వ ప్లేస్‌కు చేరుకోగా.. వరుస హాఫ్‌సెంచరీలు సాధించిన అయ్యర్‌ ఏకంగా 20 స్థానాలు ఎగబాకి 54వ స్పాట్‌కు చేరుకున్నాడు.

ఈ జాబితాలో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌, మరో పాక్‌ ఆటగాడు ఇమామ్‌ ఉల్‌ హాక్‌, సఫారీ ప్లేయర్లు డస్సెన్‌, డికాక్‌లు టాప్‌ 4గా నిలిచారు. ఇక బౌలర్ల విషయానికొస్తే.. కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా అతని కంటే కేవలం ఒక్క పాయింట్‌ వెనుక ఉండి రెండో స్థానంలో నిలిచాడు.
చదవండి:  వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 1.. ఇప్పుడు టెస్టు ఫార్మాట్‌లో!
  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top