టీ20 ప్రపంచకప్-2026 హీరో, టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇతరుల మెప్పు కోసం తాను ఎప్పుడూ ఏ పనీ చేయలేదని తెలిపాడు. ఎల్లప్పుడూ తన మనసు చెప్పినట్లే నడుచుకున్నానని.. ఈ విషయంలో తాను స్వార్థపరుడినే అన్నాడు.
దాగుడుమూతల మాదిరి..
భారత టీ20 జట్టు ఓపెనర్‌గా 2024 నుంచి రాణిస్తున్న సంజూ శాంసన్.. శుబ్‌మన్ గిల్ (Shubman Gill) పునరాగమనంతో కొన్నాళ్లు తుదిజట్టులో చోటు కోల్పోయాడు. ఆ తర్వాత గిల్ స్థానంలో తిరిగి జట్టులోకి వచ్చినా.. సరిగ్గా వరల్డ్‌కప్ టోర్నీ ఆరంభానికి ముందే ఫామ్ కోల్పోయాడు. దీంతో ఓపెనర్, వికెట్ కీపర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్ కిషన్ (Ishan Kishan) భర్తీ చేశాడు.
నాకౌట్ దశలో వరుసగా హాఫ్ సెంచరీలు
అయితే, కీలక నాకౌట్ మ్యాచ్‌లలో యాజమాన్యం సంజూకు తిరిగి ఓపెనర్‌గా అవకాశం ఇవ్వగా దుమ్ములేపాడు. ముఖ్యంగా సెమీస్ చేరాలంటే వెస్టిండీస్‌తో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో 97 పరుగులతో అజేయంగా నిలిచాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్.

ఆ తర్వాత ఇంగ్లండ్‌తో సెమీస్‌లో 89, న్యూజిలాండ్‌తో ఫైనల్లో 89 పరుగులతో సంజూ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఈ మూడు సందర్భాల్లోనూ అతడి సెంచరీ చేసే అవకాశం కోల్పోవడం గమనార్హం. ఏదేమైనా భారత్ టీ20 వరల్డ్‌కప్-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు అందుకున్నాడు.
ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన సంజూ తనకు జట్టు ప్రయోజనాలే అత్యంత ముఖ్యమని పేర్కొన్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ డ్రెసింగ్ రూమ్‌లో ఎప్పుడూ దీని గురించే మాట్లాడేవారన్నాడు. ప్రతి ఒక్క ఆటగాడు జట్టు విజయం కోసమే శ్రమించాలని దిశా నిర్దేశం చేసేవారని పేర్కొన్నాడు.
ఆ విషయంలో నేను స్వార్థపరుడినే
‘‘మా కోచ్ , కెప్టెన్ డ్రెసింగ్‌రూమ్‌లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారు. వ్యక్తిగత రికార్డుల కంటే కూడా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని.. అందుకు తగ్గట్లే ఆడాలని పదే పదే మాకు చెప్పేవారు. మా నాయకత్వ బృందం నిర్ణయానుసారమే మేమంతా నడుచుకున్నాము.
నిజం చెప్పాలంటే ప్రతి ఒక్క ఆటగాడు అలాగే ఆలోచించాలి. నేనైతే నా మనసు చెప్పినట్లే జట్టు ప్రయోజనాల కోసం మాత్రమే ఆడేవాడిని. ఈ విషయంలో నేను స్వార్థపరుడినే. నా పట్ల నేను నిజాయితీగా ఉండటం ద్వారా నాలోని బలహీనతలు అధిగమించడం సులువైంది’’ అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు.
కాగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం ఇటీవలే ఇదే విషయాన్ని నొక్కి వక్కాణించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యంలో 2024లో టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టులో అనుభవం ఉందని.. అయితే, తమ జట్టులో యువకులు ఉన్నా జట్టు ప్రయోజనాలకే పెద్దపీట వేశారని అన్నాడు. తద్వారా టీమిండియా మరోసారి వరల్డ్‌కప్ ట్రోఫీ గెలిచిందని పేర్కొన్నాడు.
చదవండి: ’నేను, కోహ్లి, రోహిత్ రిటైర్ అవ్వాలని గంభీర్ కోరుకున్నా పర్లేదు’


