బ్యాడ్మింటన్ టోర్నీ
సింగపూర్: భారత అగ్రశ్రేణి షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ సింగపూర్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–750 బ్యాడ్మింటన్ టోర్నీలో సంచలనం సృష్టించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో ప్రపంచ 35వ ర్యాంకర్ ప్రణయ్ 10–21, 21–12, 21–18తో ప్రపంచ 5వ ర్యాంకర్, 2018 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా)పై విజయం సాధించాడు.
61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 33 ఏళ్ల ప్రణయ్ తొలి గేమ్‌ను కోల్పోయినా... వెంటనే తేరుకొని రెండు వరుస గేముల్లో నెగ్గి విజయాన్ని అందుకున్నాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ లో కీన్ యెవ్ (సింగపూర్)తో ప్రణయ్ తలపడతాడు. లో కీన్ యెవ్ తొలి రౌండ్‌లో 22–20, 19–21, 21–17తో ప్రపంచ మాజీ నంబర్‌వన్, భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించాడు. మరోవైపు భారత నంబర్‌వన్ లక్ష్య సేన్ తొలి రౌండ్‌లో గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టాడు. లక్ష్య సేన్ 21–17, 21–15తో లు గ్వాంగ్ (చైనా)పై గెలుపొందాడు.
మహిళల సింగిల్స్‌లో భారత రైజింగ్ స్టార్ మాళవిక బన్సోద్‌కు నిరాశ ఎదురైంది. తొలి రౌండ్‌లో మాళవిక 21–11, 19–21, 12–21తో లిన్ సియాంగ్ టి (చైనీస్ తైపీ) చేతిలో పోరాడి ఓడిపోయింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో రుతపర్ణ–శ్వేతపర్ణ పాండా (భారత్) ద్వయం 9–21, 17–21తో పథ్థారిన్–సరిసా జాన్‌పెంగ్ (థాయ్‌లాండ్) జోడీ చేతిలో ఓడిపోయింది.
నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో రికో గుంజీ (జపాన్)తో పీవీ సింధు; కున్లావుత్ వితిద్‌సర్న్ (థాయ్‌లాండ్)తో లక్ష్య సేన్; లీ జె హుయ్–యాంగ్ పో సువాన్ (చైనీస్ తైపీ)లతో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి తలపడతారు.


