నీకిది అవసరమా?: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌ | Is He Really Opening batter: Pietersen miffed with Pant erratic calls | Sakshi
Sakshi News home page

నువ్వు నిజంగా ఓపెనింగ్‌ బ్యాటర్‌వేనా?: ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Apr 2 2026 3:15 PM | Updated on Apr 2 2026 4:10 PM

Is He Really Opening batter: Pietersen miffed with Pant erratic calls

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ వ్యూహాన్ని ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ విమర్శించాడు. ఐపీఎల్‌-2026లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో పంత్‌ ఓపెనర్‌గా రావడాన్ని తప్పుబట్టాడు.

బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కూడా చర్చ
కాగా రూ. 27 కోట్ల భారీ ధరకు లక్నో గతేడాది పంత్‌ (Rishabh Pant)ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, గత సీజన్‌లో అతడు బ్యాటర్‌గా పూర్తిగా విఫలమయ్యాడు. చివరి మ్యాచ్‌లో సెంచరీ మినహాయిస్తే మిగతా 12 ఇన్నింగ్స్‌లలో కలిపి 151 పరుగులే చేశాడు. దీంతో పంత్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌పై కూడా చర్చ సాగింది.

తొలి మ్యాచ్‌లోనే దురదృష్టం
ఈ నేపథ్యంలో తన సత్తా చూపించేందుకు ఓపెనర్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. అయితే, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌లతో పోటీ పడి భారత జట్టులో మళ్లీ చోటును ఆశిస్తున్న అతడిని తొలి మ్యాచ్‌లోనే దురదృష్టం వెంటాడింది. ఢిల్లీతో మ్యాచ్‌లో పంత్‌ మిచెల్‌ మార్ష్‌కు జోడీగా ఓపెనర్‌గా వచ్చాడు.

ఈ క్రమంలో ముకేశ్‌ వేసిన బంతిని మార్ష్‌ నేరుగా ఆడగా అది బౌలర్‌ చేతికి తగులుతూ వెళ్లి స్టంప్స్‌ను ఎగరగొట్టింది. దీంతో క్రీజ్‌ బయట ఉన్న నాన్‌ స్ట్రయికర్‌ పంత్‌ రనౌట్‌ అయి నిరాశగా వెనుదిరగక తప్పలేదు. ఈ నేపథ్యంలో మరోసారి పంత్‌ ఆట తీరుపై విమర్శలు వస్తున్నాయి.

నువ్వు నిజంగా ఓపెనింగ్‌ బ్యాటర్‌వేనా?
ఇక ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ సైతం ఈ విషయంపై స్పందించాడు. ‘‘లక్నో జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ డెప్త్‌ గమనించినట్లయితే.. రిషభ్‌ పంత్‌ అసలు ఓపెనర్‌గా రావాల్సిన అవసరం ఉందనే అనిపించదు. నిజానికి కాస్త వెనుకే అతడు రావాల్సింది. గత సీజన్లో తనను తాను డిమోట్‌ చేసుకున్న పంత్‌.. అకస్మాత్తుగా ఈసారి ఇలా ఓపెనర్‌గా వచ్చాడు.

ఆటను ఆస్వాదించు
ఓపెనర్‌ లేదంటే వన్‌డౌన్‌ బ్యాటర్‌గా నిన్ను నువ్వు ఒత్తిడికి లోనుచేసుకోవద్దు. ఆటను ఆస్వాదిస్తూ ముందుకు సాగు. ఒత్తిడిని జయిస్తే నువ్వు రాణించగలవు. ఓపెనర్‌గా రావాలనే ఒత్తిడిలో ఇప్పుడేం జరిగిందో చూశావు కదా! ఇకముందు ఇలాంటి పునరావృతం చేయకపోతే మంచిది’’ అని పీటర్సన్‌ జియో హాట్‌స్టార్‌ షోలో భాగంగా పంత్‌కు సలహా ఇచ్చాడు.

కాగా పంత్‌ తన టీ20 కెరీర్‌లో ఓపెనర్‌గా ఇప్పటికి 23 టీ20 ఇన్నింగ్స్‌ ఆడి 672 పరుగులు చేశాడు. ఇందులో ఓ సెంచరీ, ఐదు అర్ధ శతకాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఢిల్లీతో మ్యాచ్‌లో లక్నో ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది.

చదవండి: నాకైతే భయం వేస్తోంది: వైభవ్‌ సూర్యవంశీపై పాక్‌ మాజీ క్రికెటర్ల వ్యాఖ్యలు

Advertisement
 
Advertisement
Advertisement