హెచ్‌సీఏలో ఎన్నికల సందడి | Sakshi
Sakshi News home page

హెచ్‌సీఏలో ఎన్నికల సందడి

Published Fri, Oct 20 2023 3:43 AM

HCA Elections at Uppal Stadium - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక అవకతవకలు, అవినీతి, కోర్టు వివాదాలు, పరస్పర ఆరోపణలు, సస్పెన్షన్‌లు, పర్యవేక్షకుల పరిపాలన తర్వాత ఎట్టకేలకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ)లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రిటర్నింగ్‌ అధికారిగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి వీఎస్‌ సంపత్‌ ఆధ్వర్యంలో నేడు ఉప్పల్‌ స్టేడియంలో ఎన్నికలు జరుగుతాయి.

వాస్తవానికి మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ అధ్యక్షుడిగా 2019లో ఎన్నికైన హెచ్‌సీఏ కార్యవర్గం పదవీ కాలం గత ఏడాది సెపె్టంబర్‌ 26నే ముగిసింది. ఆ వెంటనే ఎన్నికలు జరగాల్సి ఉన్నా... వేర్వేరు వివాదాలతో అవి వాయిదా పడ్డాయి. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని ఎన్నికలు జరిగే వరకు రోజూవారీ కార్యకలాపాల కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ (రిటైర్డ్‌) ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలో ఏకసభ్య పర్యవేక్షణ కమిటీని నియమించింది.

ఈ కమిటీ ఆధ్వర్యంలోనే హైదరాబాద్‌లో మూడు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లు కూడా జరిగాయి. చివరకు అక్టోబర్‌ 20న ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దీనికి ముందు హెచ్‌సీఏను ప్రక్షాళన చేసే క్రమంలో 57 క్లబ్‌లపై నాగేశ్వరరావు నిషేధం విధించారు. దాంతో ఈ క్లబ్‌లకు ఎన్నికల్లో ఓటు హక్కు లేకుండా పోయింది.  

నాలుగు ప్యానెల్‌లుగా... 
అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, కోశాధికారి, కౌన్సిలర్‌... ఇలా ఆరు పదవుల కోసం ఎన్నికలు జరగనున్నాయి. లోధా కమిటీ సిఫారసులు, కొత్త నియమావళి కారణంగా గతంలో కీలక పదవులు నిర్వహించిన సీనియర్లందరూ ఈసారి పోటీలో లేకపోగా, తాము మద్దతునిస్తూ సన్నిహితులను బరిలోకి దించారు. దాంతో ఈసారి ఎక్కువగా కొత్త మొహాలు కనిపిస్తున్నాయి. నాలుగు వేర్వేరు గ్రూప్‌లుగా విడిపోయి అభ్యర్థులంతా పోటీ చేస్తున్నారు. అయితే ఫలితం విషయంలో గ్రూప్‌లతో సంబంధం లేదు. ఒక్కో పదవి కోసం అత్యధిక ఓట్లు సాధించిన వారు ప్యానెల్‌తో సంబంధం లేకుండా ఎన్నికవుతారు. పోలింగ్‌ కోసం మొత్తం 173 ఓట్లు అందుబాటులో ఉన్నాయి. 

ఇందులో 101 రెగ్యులర్‌ క్రికెట్‌ క్లబ్‌లు కాగా 48 ఇన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లు ఉన్నాయి. 9 జిల్లా క్లబ్‌లతో పాటు 15 మందికి అంతర్జాతీయ ఆటగాళ్ల హోదాలో ఓటు హక్కు ఉంది. గెలిస్తే తాము హైదరాబాద్‌ క్రికెట్‌   సంఘాన్ని చక్కదిద్దుతామని, వివాదాలు లేకుండా నడిపిస్తామని అభ్యర్థులంతా హామీ ఇస్తున్నారు. శుక్రవారం సాయంత్రమే ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు.  

Advertisement
 

తప్పక చదవండి

Advertisement