
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 12వ సీజన్‌లో హర్యానా స్టీలర్స్ ఆరో విజయం తమ ఖాతాలో వేసుకుంది. శనివారం జరిగిన పోరులో హర్యానా స్టీలర్స్ 38–36 పాయింట్ల తేడాతో తమిళ్ తలైవాస్‌పై విజయం సాధించింది. స్టీలర్స్‌కు ఇది వరుసగా నాలుగో గెలుపు కావడం విశేషం. హర్యానా స్టీలర్స్ తరఫున శివమ్ 9 పాయింట్లు, వినయ్ 7 పాయింట్లతో సత్తాచాటగా... తమిళ్ తలైవాస్ తరఫున అర్జున్ దేశ్వాల్ 13 పాయింట్లతో పోరాడాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో హర్యానా 20 రెయిడ్ పాయింట్లు సాధించగా... తలైవాస్ 22 పాయింట్లు సాధించింది.
ట్యాక్లింగ్‌లో ఇరు జట్లు తొమ్మిదేసి పాయింట్లు సాధించాయి. అయితే ఎక్స్‌ట్రా పాయింట్లలో ముందున్న హర్యానా గెలుపొందింది. తాజా సీజన్‌లో 8 మ్యాచ్‌లాడిన స్టీలర్స్ 6 విజయాలు, 2 పరాజయాలతో 12 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక మూడో స్థానానికి చేరింది. మరో మ్యాచ్‌లో పట్నా పైరెట్స్ 33–30 పాయింట్ల తేడాతో దబంగ్ ఢిల్లీపై విజయం సాధించింది. సీజన్ ఆరంభం నుంచి ఓటమి ఎరగకుండా దూసుకెళ్తున్న దబంగ్ ఢిల్లీకి ఆరు విజయాల తర్వాత ఇదే తొలి పరాజయం.
పట్నా తరఫున సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ అంకిత్ రాణా 12 పాయింట్లతో విజృంభించాడు. అంకిత్ జగ్లాన్ 6, అయాన్ 5 పాయింట్లతో అతడికి అండగా నిలిచారు. దబంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ 8, అషు మాలిక్ 6 పాయింట్లు సాధించారు. తాజా సీన్‌లో పట్నా పైరెట్స్ 7 మ్యాచ్‌లాడి 2 విజయాలు, 5 పరాజయాలతో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక తొమ్మిదో స్థానంలో నిలిచింది.
మరోవైపు ఢిల్లీ 7 మ్యాచ్‌లాడి 6 విజయాలు, ఒక పరాజయంతో 12 పాయింట్లతో పట్టిక రెండో స్థానంలో కొనసాగుతోంది. లీగ్‌లో ఆదివారం విశ్రాంతి దినం కాగా... సోమవారం గుజరాత్ జెయింట్స్‌తో బెంగళూరు బుల్స్, తమిళ్ తలైవాస్‌తో యూపీ యోధాస్ తలపడతాయి.