
న్యూజిలాండ్‌తో రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ (Harry Brook) ధనాధన్ దంచికొట్టాడు. విధ్వంసకర ఇన్నింగ్స్‌తో విరుచుకుపడి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన బ్రూక్.. 22 బంతుల్లోనే అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.
మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడేందుకు ఇంగ్లండ్ క్రికెట్ జట్టు న్యూజిలాండ్ పర్యటన (NZ vs ENG)కు వెళ్లింది. ఇందులో భాగంగా శనివారం తొలి టీ20 వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసిపోయింది. ఈ క్రమంలో క్రైస్ట్‌చర్చ్ వేదికగా సోమవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆతిథ్య కివీస్ జట్టు.. ఇంగ్లండ్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.
ఫిల్ సాల్ట్ ధనాధన్.. బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్
ఈ క్రమంలో ఓపెనర్ జోస్ బట్లర్ (4) స్వల్ప స్కోరుకే వెనుదిరగగా.. మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ మాత్రం అదరగొట్టాడు. 56 బంతులు ఎదుర్కొన్న ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 85 పరుగులు సాధించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన జేకబ్ బెతెల్ కాసేపు మెరుపులు (12 బంతుల్లో 24) మెరిపించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ బ్రూక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు.
మొత్తంగా 35 బంతులు ఎదుర్కొన్న బ్రూక్.. ఆరు ఫోర్లు, ఐదు సిక్స్‌లు బాది 78 పరుగులు సాధించాడు. మిగతా వారిలో సామ్ కర్రాన్ 3 బంతుల్లో 8, టామ్ బాంటన్ 12 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచారు. ఈ క్రమంలో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు నష్టపోయి 236 పరుగులు సాధించింది.
కివీస్ ఎదుట భారీ లక్ష్యం
తద్వారా న్యూజిలాండ్‌కు 237 పరుగుల మేర భారీ లక్ష్యం విధించింది. ఇదిలా ఉంటే.. క్రైస్ట్‌చర్చ్‌లోని హాగ్లే ఓవల్ మైదానంలో ఏ జట్టుకైనా టీ20లలో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.ఇక న్యూజిలాండ్ బౌలర్లలో కైలీ జెమీషన్ రెండు వికెట్లు కూల్చగా.. జేకబ్ డఫీ, మైకేల్ బ్రాస్‌వెల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.
అరుదైన మైలురాయిని చేరుకున్న హ్యారీ బ్రూక్
అంతర్జాతీయ టీ20లలో హ్యారీ బ్రూక్ వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున ఈ ఫార్మాట్లో 51 మ్యాచ్‌లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఖాతాలో ప్రస్తుతం 1012 పరుగులు ఉన్నాయి.
అంతేకాదు.. న్యూజిలాండ్‌తో రెండో టీ20లో కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న హ్యారీ బ్రూక్ మరో ఘనతను సాధించాడు. ఇంగ్లండ్ తరఫున పొట్టి ఫార్మాట్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో ఇయాన్ మోర్గాన్ (21 బంతుల్లో) ముందు వరుసలో ఉన్నాడు. ఇక సారథిగా బ్రూక్‌కు ఇదే తొలి టీ20 ఫిఫ్టీ కాగా.. ఓవరాల్‌గా ఐదవది కావడం గమనార్హం.
చదవండి: ‘నా వల్లే జట్టు ఓడింది.. ఓటమికి బాధ్యత నాదే.. తెలివిగా ఆడితే బాగుండేది’