తొలి సెంచరీ: పాండ్యా సోదరుల భావోద్వేగం

Hardik Pandya Emotional Words Krunal Vijay Hazare Trophy Hundred - Sakshi

న్యూఢిల్లీ: విజయ్‌ హజారే ట్రోఫీ-2021 టోర్నమెంట్‌లో భాగంగా టీమిండియా క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యా తొలిసారిగా సెంచరీ నమోదు చేశాడు. బరోడా జట్టు తరఫున ఆడుతున్న అతడు 90 బంతుల్లో 127 పరుగులు చేశాడు. ప్రత్యర్థి జట్టు త్రిపురపై 6 వికెట్ల తేడాతో బరోడా గెలుపొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సందర్భంగా తన తండ్రి హిమాన్షు పాండ్యాను గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఒకవేళ ఇప్పుడు ఆయన బతికి ఉంటే ఎంతో సంతోషించే వారని, తను గతంలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసినప్పుడు తనను అభినందించిన తీరును జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉద్వేగానికి గురయ్యాడు. ఈ మేరకు... ‘‘గత నెలలో సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో నేను 76 పరుగులు చేసినపుడు, నాన్న నాతో చివరిసారిగా క్రికెట్‌ గురించి మాట్లాడారు. 

‘‘నా ప్రియమైన కుమారుడా.. ఇప్పుడు నీ టైం స్టార్ట్‌ అయ్యింది’’ అని నన్ను ప్రోత్సహించారు. ఇక ఇప్పుడు నేను తొలిసారి సెంచరీ చేశాను. కానీ భౌతికంగా ఆయన మాతో లేరు. అయితే, నిన్న నేను పరుగు తీస్తున్న ప్రతిసారీ ఆయన నన్ను చీర్‌ చేసి ఉంటారని నా హృదయం బలంగా నమ్ముతోంది. ‘‘శభాష్‌ కృనాల్‌ శభాష్‌’’ అని ఆయన అని ఉంటారు! నా ఈ ప్రత్యేక ఇన్నింగ్స్‌ నాన్నకే అంకితం. నా కలలు నిజం చేసకునే క్రమంలో క్షణక్షణం తోడున్న నీకు ధన్యవాదాలు. లవ్‌ యూ పప్పా’’అంటూ కృనాల్‌ ఇన్‌స్టాలో ఎమోషల్‌ పోస్టు షేర్‌ చేశాడు. ఇక ఇందుకు స్పందించిన అతడి సోదరుడు, టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా.. ‘‘నాన్న నిన్ను చూసి గర్వపడుతూనే ఉంటాడు అన్నయ్యా.. లవ్‌ యూ’’అని ప్రేమ చాటుకున్నాడు. కాగా జనవరి 16న హార్దిక్‌ తండ్రి హిమాన్షు పాండ్యా గుండెపోటుకు గురై మరణించిన విషయం విదితమే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top