క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు | Gunshots Fired At International Board President Whose Body Was Recently ICC Suspended | Sakshi
Sakshi News home page

క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు

May 21 2026 2:04 PM | Updated on May 21 2026 2:45 PM

Gunshots Fired At International Board President Whose Body Was Recently ICC Suspended

ఓ అంతర్జాతీయ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పుల కలకలం రేగింది. క్రికెట్‌ కెనడా అధ్యక్షుడు అర్విందర్‌ ఖోసా నివాసం బయట గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన క్రికెట్‌ వర్గాల్లో దుమారం రేపుతోంది.

బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే నగరంలోని న్యూటన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలమానం ప్రకారం మే 20 తెల్లవారుజామున 4:40 గంటల సమయంలో ఖోసా ఇంటి వద్ద పలుమార్లు తుపాకీ కాల్పులు జరిగినట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. అయితే ఇంటి తలుపులు, కిటికీలపై బుల్లెట్‌ గుర్తులు కనిపించడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన సర్రే పోలీసులు.. ఎక్స్‌టోర్షన్‌ (దందా వసూళ్ల బెదిరింపులు)కు సంబంధించిన దాడిగా భావిస్తున్నారు. ఈ ఇంటికి సంబంధం ఉన్న వ్యక్తికి గతంలో ఎక్స్‌టోర్షన్‌ బెదిరింపులు వచ్చినట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, ఇటీవలికాలంలో కెనడా క్రికెట్‌ చుట్టూ వివాదాలు పరిపాటిగా మారాయి. భారత్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా ఆ జట్టుపై స్పాట్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు వచ్చాయి. ఓ డాక్యుమెంటరీలో బయటపడిన వివరాల ప్రకారం.. 2026 ‍ప్రపంచకప్‌లో భాగంగా కెనడా-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఐసీసీ అవినీతి నిరోధక విభాగం విచారణ జరుపుతుంది. 

కెనడా కెప్టెన్‌ దిల్‌ప్రీత్‌ బజ్వాపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అతడిని టోర్నీకి ముందు ఆశ్చర్యకరంగా జట్టు కెప్టెన్‌గా నియమించడం అనుమానాలకు బలం చేకూరుస్తుంది.

పరిపాలనా సమస్యలు, ఆర్దికపరమైన అవకతవలు, ఫిక్సింగ్‌ ఆరోపణల కారణంగా ఐసీసీ ఇటీవలే క్రికెట్‌ కెనడాకు ఆరు నెలలపాటు ఫండింగ్‌ను ఆపింది. ఇలాంటి తరుణంలో బోర్డు అధ్యక్షుడి ఇంటి వద్ద కాల్పులు జరగడం చర్చనీయాంశంగా మారింది. 

Advertisement
 
Advertisement
Advertisement