హార్దిక్‌కు అన్నీ ఇచ్చాము.. పూర్తిగా నిరాశపరిచాడు: ముంబై కోచ్‌ | Gave Hardik Best Opportunity: Pollard raises questions on MI captaincy | Sakshi
Sakshi News home page

హార్దిక్‌కు అన్నీ ఇచ్చాము.. పూర్తిగా నిరాశపరిచాడు: ముంబై కోచ్‌

May 25 2026 9:34 AM | Updated on May 25 2026 9:56 AM

Gave Hardik Best Opportunity: Pollard raises questions on MI captaincy

హార్దిక్‌ పాండ్యా (PC: BCCI)

ఐపీఎల్‌-2026 సీజన్‌ను ముంబై ఇండియన్స్‌ పరాజయంతో ముగించింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. తద్వారా ఈ సీజన్‌లో పద్నాలుగింట కేవలం పది పరాజయాలతో.. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.

హార్దిక్‌పై వేటుకు రంగం సిద్ధం
ఇక ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) ఇటు సారథిగా.. అటు ఆల్‌రౌండర్‌గా విఫలమయ్యాడు. సీజన్‌ ఆసాంతం జట్టుతో పాటు అతడి వ్యక్తిగత ప్రదర్శన విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో హార్దిక్‌పై వేటు వేసేందుకు జట్టు యాజమాన్యం సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

హార్దిక్‌కు అన్నీ ఇచ్చాము.. పూర్తిగా నిరాశపరిచాడు
రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం ముంబై బ్యాటింగ్‌ కోచ్‌ కీరన్‌ పొలార్డ్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చాయి. ‘‘నాయకుడిగా, ఆటగాడిగా హార్దిక్‌ యాజమాన్యం పెట్టుకున్న అంచనాలు అందుకోలేకపోయాడు. కెప్టెన్‌గా, వ్యక్తిగతంగా అతడు మేము ఆశించినట్లు రాణించలేకపోయాడు.

అయితే, కెప్టెన్‌గా అతడికి మేము అన్నీ అత్యుత్తమైనవే అందించాము. జట్టు మెరుగైన ప్రదర్శన కోసం అతడికి ఏం కావాలో అవన్నీ సమకూర్చాము. ఒక్కరిపై నింద వేసి తప్పించుకోవాలని ఇక్కడ ఎవరూ అనుకోవడం లేదు.

జట్టు సమిష్టి వైఫల్యమే ఇది. కొన్నిసార్లు గెలుస్తాం. మరికొన్ని సార్లు ఓడిపోతాం. హార్దిక్‌, మేము జట్టు కోసం ఎంతగానో శ్రమించాము. కానీ ఏదీ వర్కౌట్‌ కాలేదు. మా గాయాలు మాని.. వచ్చే సీజన్‌లో మరింత గొప్పగా తిరిగిరావాలని కోరుకుంటున్నా’’ అని కీరన్‌ పొలార్డ్‌ పేర్కొన్నాడు. అయితే, జట్టులో మార్పుల గురించి ప్రస్తుతం తానేమీ స్పందించలేనని.. అన్నీ ఆలోచించే మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశాడు.

హార్దిక్‌తో పాటు వారిద్దరూ..
కాగా వెన్నునొప్పి కారణంగా నాలుగు మ్యాచ్‌లకు దూరమైన పాండ్యా.. 10 ఇన్నింగ్స్‌లో కలిపి 206 పరుగులు సాధించాడు. ఇక పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌.. ఈ సీజన్‌లో కేవలం నాలుగు వికెట్లు తీయగలిగాడు. హార్దిక్‌తో పాటు ప్రధాన ఆటగాళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా తేలిపోవడం ముంబై ఇండియన్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది.

చదవండి: ‘అతడి వల్లే విజయం.. లేకుంటే ఇంటికి పోయేవాళ్లం!’

Advertisement
 
Advertisement
Advertisement