
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ Gautam Gambhir)కు చాలా కాలం తర్వాత గొప్ప ఊరట లభించింది. ఇంగ్లండ్ (IND vs ENG)తో రెండో టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంతో అతడిపై విమర్శలకు అడ్డుకట్ట పడింది. కాగా గౌతీ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్‌లో టీమిండియా బాగానే రాణిస్తోంది.
వరుస పరాజయాలు
ముఖ్యంగా ఇటీవల చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy) రూపంలో ఐసీసీ ట్రోఫీ గెలవడం గంభీర్ కోచింగ్ కెరీర్‌లో ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. అయితే, టెస్టుల్లో మాత్రం గౌతీ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌పై విజయం మినహా.. టీమిండియా వరుసగా దారుణ పరాజయాలు చవిచూసింది. స్వదేశంలో ఎన్నడూ లేని విధంగా న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్ అయింది. అనంతరం ఆస్ట్రేలియా పర్యటనలోనూ ఘోర పరాభవం చవిచూసింది.
ఆసీస్ చేతిలో 3-1తో ఓడి దాదాపు పదేళ్ల తర్వాత తొలిసారి బోర్డర్- గావస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ క్రమంలో స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఈ ట్రోఫీ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు కెప్టెన్ రోహిత్ శర్మ, దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్టులకు స్వస్తి పలికారు.
ఈ నేపథ్యంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ టెస్టు జట్టు పగ్గాలు చేపట్టగా.. ఇంగ్లండ్ పర్యటనలోనూ ఆరంభంలో చేదు అనుభవమే మిగిలింది. తొలి టెస్టులో టీమిండియా గెలవాల్సిన మ్యాచ్‌ను చేజార్చుకుంది. ఇక సంప్రదాయ ఫార్మాట్లో భారత్ ఇలా వరుసగా మ్యాచ్‌లు ఓడటంతో గంభీర్‌పై విమర్శల వర్షం కురిసింది. అతడిని కోచ్‌గా తొలగించాలనే డిమాండ్లు వచ్చాయి.
తొలిసారి ఈ వేదికపై గెలిచి
ఇలాంటి తీవ్ర ఒత్తిడి నడుమ టీమిండియా తమకు అచ్చిరాని ఎడ్జ్‌బాస్టన్ వేదికపై ఇంగ్లండ్‌పై భారీ విజయం సాధించింది. ఆతిథ్య జట్టుకు ఊహించని రీతిలో షాకిచ్చి.. ఏకంగా 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తద్వారా టెస్టుల్లో కెప్టెన్‌గా గిల్‌కు.. విదేశీ గడ్డపై కోచ్‌గా గంభీర్‌కు తొలి విజయమే మధురానుభూతిని మిగిల్చింది.
ఈ క్రమంలో ఇంగ్లండ్‌పై జయభేరి మోగించిన తర్వాత గంభీర్ చిరునవ్వులు చిందించాడు. సాధారణంగా అతడు ఎప్పుడూ గంభీరంగానే ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే, ఈసారి మాత్రం ఇరుజట్ల ఆటగాళుల పరస్పరం కరచాలనం చేసుకుంటున్న సమయంలో గిల్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న గౌతీ.. ఎంతో సంతోషంగా కనిపించాడు.
అతడు తరచూగా నవ్వడు.. ఈసారి మాత్రం
ఇందుకు సంబంధించిన దృశ్యాలను కెమెరామెన్ ఒడిసిపట్టగా.. కామెంటేటర్ రవిశాస్త్రి గంభీర్‌ను ఉద్దేశించి తనదైన శైలిలో చణుకులు విసిరాడు. ‘‘అతడు తరచూగా నవ్వడు. అయితే, ఈసారి మాత్రం చిరునవ్వులు చిందించేందుకు పూర్తిగా అర్హుడు.
ఒక ఓటమి తర్వాత జట్టు తిరిగి పుంజుకోవడం.. అది కూడా ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవ్వడం.. సిరీస్ ఆశలను సజీవం చేసుకోవడం కంటే ఓ కోచ్‌కు గొప్ప సంతోషం మరేదీ ఉండదు’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
అమాసకు.. పున్నానికోసారి మాత్రమే!
ఇక రవిశాస్త్రి కామెంట్స్ వైరల్ కాగా.. ‘‘అమాసకు.. పున్నానికి (అమావాస్యకు.. పౌర్ణమికి) ఓసారి నవ్వే గంభీర్.. ఈసారి మనస్ఫూర్తిగా చిరునవ్వులు చిందిస్తుంటే సంతోషంగా ఉంది’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కాగా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు టెస్టులు ఆడుతోంది. లీడ్స్ వేదికగా తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐదు వికెట్ల తేడాతో గెలవగా.. బర్మింగ్‌హామ్‌లో గెలిచిన భారత్ సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరుజట్ల మధ్య జూలై 10-14 వరకు లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో మూడో టెస్టుకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: ప్రాణం పెట్టి ఆడాడు.. అతడొక అద్భుతం అంతే: శుబ్‌మన్ గిల్
🎙️ Ravi Shastri on-air: Don't see him smile too often but Gautam Gambhir deserves every bit of it. #ENGvsIND pic.twitter.com/avyTsSTv5t
— KKR Vibe (@KnightsVibe) July 6, 2025