Major League Cricket: అమెరికా టీ20 లీగ్‌లో నలుగురు భారత సంతతి ఆటగాళ్లు!

Full list of Indian players selected in Major League Cricket Draft - Sakshi

హ్యూస్టన్‌: అమెరికాలో క్రికెట్‌ అభివృద్ధిలో భాగంగా తొలిసారి నిర్వహించబోతున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ (ఎంఎల్‌సీ)–2023లో మొదటి రోజు ఆటగాళ్ల ఎంపిక పూర్తయింది. మొత్తం ఆరు జట్లు ఇందులో పాల్గొంటుండగా నాలుగు టీమ్‌లు ఐపీఎల్‌ యాజమాన్యాలకు (ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, చెన్నై) చెందినవే ఉన్నాయి. ఐపీఎల్‌ తరహాలో వేలం ద్వారా కాకుండా నేరుగా డ్రాఫ్ట్‌ ద్వారా ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు ఎంచుకుంటున్నాయి.

ఇందు లో నిబంధనల ప్రకారం ‘స్థానిక ఆటగాళ్లు’గా గుర్తింపు ఉన్న 54 మంది అమెరికా క్రికెటర్లను ఆయా జట్లలోకి తీసుకున్నారు. వీరిలో 15 మంది అమెరికా జాతీయ జట్టుకు జూనియర్‌ లేదా సీనియర్‌ స్థాయిలో ప్రాతినిధ్యం వహించారు.

అయితే ఈ 54 మందిలో ఏడుగురు మాత్రమే అమెరికాలో పుట్టినవారు కావడం విశేషం. ఇందులో నలుగురు క్రికెటర్లు అఖిలేశ్‌ రెడ్డి బొడుగం, సాయిదీప్‌ గణేశ్, సంజయ్‌ కృష్ణమూర్తి, సాయితేజ రెడ్డి ముక్కామల భారత సంతతికి చెందినవారు.

వీరిలో సాయితేజ ముక్కామల ఈ ఏడాది యూఎస్‌ సీనియర్‌ టీమ్‌ తరఫున కూడా ఆడాడు. అతనితో పాటు సాయిదీప్, సంజయ్‌లు అండర్‌–23 కేటగిరీలో ఎంపికయ్యారు. లాస్‌ ఏంజెలిస్‌ నైట్‌రైడర్స్, ముంబై ఇండియన్స్‌ న్యూయార్క్, సీటల్‌ ఆర్కాస్‌ (ఢిల్లీ క్యాపి టల్స్, సత్య నాదెళ్ల సహభాగస్వామ్యం), సూపర్‌ కింగ్స్‌ టెక్సస్, శాన్‌ఫ్రాన్సిస్కో యూనికార్న్స్, వాషింగ్టన్‌ ఫ్రీడమ్‌ పేర్లతో ఈ ఆరు జట్లు ఉన్నాయి. ఈ ఆరు టీమ్‌లు మార్క్యూ ఓవర్‌సీస్‌ ఆటగాళ్లుగా ఆరోన్‌ ఫించ్, నోర్జే, హసరంగ, డి కాక్, స్టొయినిస్, మిచెల్‌ మార్ష్‌లను ఎంచుకున్నాయి.
చదవండి: LLC 2023: తరంగ విధ్వంసం.. లెజెండ్స్‌ లీగ్‌ ఛాంపియన్స్‌గా ఆసియా లయన్స్

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top