Gurgaon: Fraud Case Against Maria Sharapova-Michael Schumacher Details Here - Sakshi
Sakshi News home page

Maria Sharapova-Michael Schumacher: షరపోవా, షుమాకర్‌లపై చీటింగ్‌, క్రిమినల్‌ కేసులు

Published Thu, Mar 17 2022 11:22 AM

Fraud Case Against Maria Sharapova-Michael Schumacher In Gurgaon - Sakshi

రష్యన్‌ టెన్నిస్‌ దిగ్గజం మరియా షరపోవాతో పాటు ఫార్ములావన్‌ మాజీ చాంపియన్‌ మైకెల్‌ షుమాకర్‌లపై గుర్గావ్‌ పోలీస్‌ స్టేషన్‌లో చీటింగ్‌, క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలోని చత్తార్‌పూర్‌ మినీఫామ్‌కు చెందిన షఫాలీ అగర్వాల్‌ అనే మహిళ ఫిర్యాదు మేరకు గుర్గావ్‌ పోలీసులు షరపోవా, షుమాకర్‌ సహా 11 మంది వ్యాపారులపై బుధవారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

షఫాలీ అగర్వాల్‌ మాట్లాడుతూ.. రియల్‌టెక్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ అనే  రియల్‌ ఎస్టేట్‌ కంపెనీ తమని మోసం చేసిందని తెలిపారు. సెక్టార్‌ 73లోని షరపోవా ప్రాజెక్ట్‌ పేరిట షుమాకర్‌ టవర్స​ అపార్టమెంట్‌లో ఒక ఫ్లాట్‌ కోసం కంపెనీ ప్రతినిధులు సుమారు రూ.80 లక్షలు తీసుకున్నారని పేర్కొన్నారు. 2016లో ఫ్లాట్‌ను అందిస్తామని నమ్మించి ఇంతవరకు మాకు అందించలేదని తెలిపారు. ఈ విషయమై కంపెనీ ప్రతినిధులను ఎన్నిసార్లు సంప్రదించినా న్యాయం జరగలేదని.. జాతీయ వినియోగదారుల కమిషన్‌లో ఫిర్యాదు చేసినా లాభం లేకపోయిందని వివరించారు.

ఈ నేపథ్యంలోనే కోర్టును ఆశ్రయించగా.. వారిపై క్రిమినల్‌, చీటింగ్‌ కేసులు నమోదు చేయమని కోర్టు వెల్లడించిందని పేర్కొన్నారు. కాగా 2016లో సదరు కంపెనీకి షరపోవా, షుమాకర్‌లు అంబాసిడర్‌గా వ్యవహరించడంతో పాటు భాగస్వాములుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పలుమార్లు కంపెనీ ప్రతినిధులతో కలిసి షరపోవా, షుమాకర్‌లు డిన్నర్‌ పార్టీల్లో పాల్గొన్నట్లు తేలింది.

ఫార్ములావన్‌లో మెర్సిడెస్‌కు ఎక్కువగా ప్రాతినిధ్యం వహించిన మైకెల్‌ షుమాకర్‌ ఏడుసార్లు ఫార్ములావన్‌ చాంపియన్‌గా నిలిచాడు. ప్రస్తుత చాంపియన్‌ లుయీస్‌ హామిల్టన్‌ కూడా ఏడుసార్లు ఫార్ములావన్‌ చాంపియన్‌షిప్‌ను గెలిచాడు. ఇక షుమాకర్‌ రికార్డులు పరిశీలిస్తే.. 2012లో రిటైర్‌ అయ్యేవరకు 91 విజయాలు, 155 ఫోడియమ్స్‌, 1566 కెరీర్‌ పాయింట్లు, 68 పోల్‌ పోజిషన్స్‌, 77 ఫాస్టెస్ట్‌ లాప్స్‌ అందుకున్నాడు. 

ఇక మహిళల టెన్నిస్‌ విభాగంలో తనకంటూ ప్రత్యేకస్థానం ఏర్పరచుకుంది. 2001లో అంతర్జాతీయ టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన షరపోవా.. టెన్నిస్‌లో అందాల రాణిగా నిలిచింది. 2001-2020 మధ్య ఐదుసార్లు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గడంతో పాటు 18 ఏళ్ల వయసులోనే నెంబర్‌ వన్‌ స్థానాన్ని ఆక్రమించింది. 2005లో 21 వారాలపాటు షరపోవా మహిళల టెన్నిస్‌ నెంబర్‌వన్‌ క్రీడాకారిణిగా నిలిచింది. ఇక కెరీర్‌ గ్రాండ్‌స్లామ్‌(యూఎస్‌ ఓపెన్‌, వింబుల్డన్‌, ఫ్రెంచ్‌ ఓపెన్‌, ఆస్ట్రేలియన్‌ ఓపెన్) అందుకున్న క్రీడాకారిణిగా షరపోవా చరిత్ర సృష్టించింది.

చదవండి: PAK vs AUS: 23 ఏళ్ల క్రితం టీమిండియా బ్యాటర్‌‌.. ఇప్పుడు పాకిస్తాన్‌ బ్యాటర్‌; సీన్‌ రిపీట్‌

AUS vs PAK: 'మా గుండె ఆగినంత పనైంది'.. అప్పుడు తిట్టినోళ్లే ఇవాళ పొగుడుతున్నారు

Advertisement

తప్పక చదవండి

Advertisement