రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మాజీ ఆటగాడు స్వస్తిక్ చికారా అయోధ్య ప్రీమియర్ లీగ్‌లో విధ్వంసం సృష్టించాడు. ఐపీఎల్ 2026 మినీ-వేలంలో అమ్ముడుపోని స్వస్తిక్ లీగ్‌లో 69 బంతుల్లోనే 195 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. అయోధ్య ప్రీమియర్ లీగ్ పోరులో హిండన్ టైటాన్స్‌పై గోమతి థండర్ తరఫున ఓపెనర్లుగా బరిలోకి దిగిన ప్రియాంశు పాండే, చికారా ఇన్నింగ్స్ ఆద్యంతం బ్యాటింగ్ చేసి 307 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
పాండే 54 బంతుల్లో 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇదే సమయంలో మరో ఓపెనర్ చికారా హిండన్ టైటాన్స్ బౌలర్లపై మెరుపు దాడి చేశాడు. 69 బంతుల్లో 195 పరుగులు బాదిన స్వస్తిక్ చికారా ఇన్నింగ్స్‌లో 21 సిక్సర్లు, 11 బౌండరీలు ఉన్నాయి. కేవలం సిక్సర్లు, బౌండరీల రూపంలోనే 126 పరుగులు వచ్చాయంటే ఊచకోత ఏ రేంజ్‌లో ఉందనేది స్పష్టంగా తెలుస్తోంది.
చికారా డబుల్ సెంచరీకి 27 పరుగుల దూరంలో 173 పరుగుల వ్యక్తిగత స్కోర్ ఉన్నప్పుడూ ఇంకా ఐదు బంతులు మిగిలి ఉన్నాయి. ఈ దశలో మూడు సిక్సర్లు, ఒక ఫోర్‌తో అలరించినప్పటికీ డబుల్ మార్క్‌కు ఐదు పరుగుల దూరంలో ఆగిపోయాడు. అనంతరం 308 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ కు దిగిన హిండన్ టైటాన్స్ 218 పరుగులకే ఆలౌటైంది. టైటాన్స్ బ్యాటర్లలో శేఖర్ సిరోహి 33 బంతుల్లో 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఎవరీ స్వస్తిక్ చికారా?
భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ను ఆరాధ్య క్రికెటర్‌గా భావించిన స్వస్తిక్ చికారా 2024 ఉత్తరప్రదేశ్ టీ20 లీగ్‌లో మీరట్ మావెరిక్స్ తరఫున ఆడుతున్నప్పుడు వెలుగులోకి వచ్చాడు. ఆ లీగ్‌లో 499 పరుగులు సాధించిన స్వస్తిక్ చికారా టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆ తర్వాత కొద్దికాలానికే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం యూపీ జట్టుకు ఎంపికయ్యాడు.
దేశవాళీ టోర్నీలో అతను నాలుగు మ్యాచ్‌లలో కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతన్ని కొనుగోలు చేసింది. 2025లో ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌లో కూడా ఆడకపోయినప్పటికీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ గెలిచిన జట్టులో చికారా సభ్యుడిగా ఉన్నాడు. ఐపీఎల్2026 వేలానికి ముందే అతడిని ఆర్సీబీ విడుదల చేసింది. కానీ వేలంలో స్వస్తిక్‌ను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు.
చదవండి: క్షమాపణ చెప్పిన పీసీబీ చైర్మన్!
Swastik Chikara hammered 195*(69) at the Ayodhya Premier League .5 short of a double ton in t20s 🤯😵.He is unsold in IPL 2026 auction pic.twitter.com/QwVPP59AmP
— Mithun 🧢 (@Mithun71389478) March 22, 2026


