FIFA WC 2022: స్పెయిన్‌తో మ్యాచ్‌.. జపాన్‌ గోల్‌పై వివాదమెందుకు? అలా జరిగి ఉంటే జర్మనీ నాకౌట్‌కు చేరేదా?!

FIFA WC 2022: Why Japan Goal Vs Spain Stand Controversy Explained - Sakshi

FIFA World Cup 2022 Japan Vs Spain: ఫిఫా వరల్డ్‌కప్‌-2022లో స్పెయిన్‌తో మ్యాచ్‌లో జపాన్‌ సాధించిన రెండో గోల్‌ వివాదాస్పదంగా మారింది. రిట్సు కొట్టిన కిక్‌తో బంతి స్పెయిన్‌ గోల్‌పోస్ట్‌ ఎడమ వైపునకు వెళ్లింది. అయితే దానిని వెంబడించిన మిటోమా బంతిని నియంత్రణలోకి తెచ్చుకొని వెనక్కి తోశాడు. అక్కడే సిద్ధంగా ఉన్న టనాకా దానిని గోల్‌గా మలిచాడు. అయితే అసిస్టెంట్‌ రిఫరీ గోల్‌ చెల్లదని ప్రకటించాడు.

బంతి ‘బైలైన్‌’ను దాటేసిందని, ఆ తర్వాతే మిటోమా వెనక్కి తోశాడు కాబట్టి గోల్‌ను గుర్తించలేదు. అయితే ఇది వీడియో అసిస్టెంట్‌ రిఫరీ (వార్‌) వద్దకు వెళ్లింది. ఎన్నో కోణాల్లో రీప్లేలు చూసి తర్జనభర్జనల అనంతరం గోల్‌ సరైందేనని, బంతి ఇంకా గమనంలోనే ఉందన్న రిఫరీ గోల్‌ను గుర్తిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఇదే వివాదంగా మారింది. 

రీప్లే తొలి యాంగిల్‌ నుంచి చూస్తే బంతి లైన్‌ దాటేసినట్లే స్పష్టంగా కనిపిస్తోంది. కానీ తర్వాతి టాప్‌ యాంగిల్‌లో మాత్రం ఇంకా లోపలే ఉన్నట్లుగా ఉంది. భౌతిక శాస్త్రం ప్రకారం చెప్పాలంటే ‘ప్యారలాక్స్‌ ఎర్రర్‌’ (వేర్వేరు కోణాల్లో చూసినప్పుడు వస్తువు యొక్క స్థానంలో కలిగే తేడా–దృష్టి విక్షేపం) ప్రభావమిది.

ఇక్కడ సరిగ్గా అదే పని చేసింది. పైనుంచి చూస్తే బంతిలో కొంత భాగం లైన్‌పైనే ఉన్నట్లుగా ఉంది. ‘ఫిఫా’ నిబంధనలను బట్టి దీనినే చివరకు సరైందిగా నిర్ధారించారు.  తద్వారా ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జపాన్‌ గ్రూప్‌- ఇ టాపర్‌గా నాకౌట్‌ దశకు చేరుకుంది. 

జపాన్‌ వల్ల.. అలా జర్మనీ కథ ముగిసింది
ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో నాలుగుసార్లు విశ్వ విజేత జర్మనీని చిత్తు చేసిన జపాన్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లోనూ అదే దూకుడు కనబర్చి మరో మాజీ చాంపియన్‌ను ఓడించింది. ఫలితంగా వరుసగా రెండో వరల్డ్‌ కప్‌లో నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. గురువారం అర్ధరాత్రి జరిగిన గ్రూప్‌ ‘ఇ’ మ్యాచ్‌లో జపాన్‌ 2–1 గోల్స్‌ తేడాతో 2010 విజేత స్పెయిన్‌ను ఓడించి గ్రూప్‌ టాపర్‌గా నిలిచింది.

జపాన్‌ తరఫున రిట్సు డోన్‌ (48వ ని.లో), ఆవో టనాకా (51వ ని.లో) గోల్స్‌ సాధించగా, స్పెయిన్‌ జట్టు నుంచి మొరాటా (11వ ని.లో) ఏకైక గోల్‌ను నమోదు చేశాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓడినా స్పెయిన్‌కు నష్టం జరగలేదు. రెండో స్థానంతో స్పెయిన్‌ ముందంజ వేసింది. పాయింట్ల సంఖ్యలో జర్మనీతో సమానంగానే నిలిచినా...గోల్స్‌ అంతరంలో జర్మనీని స్పెయిన్‌ వెనక్కి తోసింది.   

బంతి స్పెయిన్‌ ఆధీనంలోనే ఉన్నా... 
మ్యాచ్‌ ఆరంభం నుంచి స్పెయిన్‌ దూకుడు కనబర్చింది. 11వ నిమిషంలోనే వచ్చిన అవకాశాన్ని స్పెయిన్‌ సమర్థంగా ఉపయోగించుకుంది. సీజర్‌ అజ్‌పిలిక్యూటా ఇచ్చిన క్రాస్‌ పాస్‌ను హెడర్‌ ద్వారా మొరాటా గోల్‌గా మలిచాడు. అయితే రెండో అర్ధ భాగంలో జపాన్‌ ఒక్కసారిగా చెలరేగింది. 142 సెకన్ల వ్యవధిలో ఆ జట్టు రెండు గోల్స్‌తో ముందంజ వేసింది.

సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన రిట్సు అనూహ్యంగా స్పెయిన్‌ ఆటగాళ్లందరినీ తప్పించి కొట్టిన కిక్‌కు కీపర్‌ ఉనై సైమన్‌ వద్ద జవాబు లేకపోయింది. కొద్ది సేపటికే టనాకా కొట్టిన గోల్‌ స్పెయిన్‌ నివ్వెరపోయేలా చేసింది. జపాన్‌ చివరి వరకు ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. మ్యాచ్‌ మొత్తంలో కేవలం 17.7 శాతం సమయం మాత్రమే బంతి జపాన్‌ ఆధీనంలో ఉంది. వరల్డ్‌ కప్‌ చరిత్రలో అతి తక్కువ సమయం బంతిని ఆధీనంలోకి ఉంచుకొని మ్యాచ్‌ నెగ్గిన జట్టుగా జపాన్‌ రికార్డు నెలకొల్పింది.   

జర్మనీ గెలిచినా... 
2018లోనూ గ్రూప్‌ దశకే పరిమితమైన జర్మనీ వరుసగా రెండోసారి నాకౌట్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. చివరి మ్యాచ్‌లో జర్మనీ 4–2 తో కోస్టారికాపై నెగ్గింది. జర్మనీ తరఫున జ్ఞాబ్రీ (10వ ని.లో), హావెట్జ్‌ (73వ, 85వ ని.లో), ఫల్‌రగ్‌ (89వ ని.లో) గోల్స్‌ సాధించగా... కోస్టారికా ఆటగాళ్లలో తెజెదా (58వ ని.లో), నూయెర్‌ (70వ ని.లో) గోల్స్‌ కొట్టారు.

టోర్నీ తొలి మ్యాచ్‌లో జపాన్‌ చేతిలో ఓడటంతోనే జర్మనీ అవకాశాలకు గండి పడింది. స్పెయిన్‌తో మ్యాచ్‌ ‘డ్రా’ చేసుకోవడంతో ఇక్కడ భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు 4–2 సరిపోలేదు.  

చదవండి: IND vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్‌ బౌలర్‌.. బీసీసీఐ ప్రకటన
FIFA WC 2022: ఘనాపై గెలిచినా.. టోర్నీ నుంచి నిష్క్రమించిన మాజీ చాంపియన్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top