సన్‌రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆటకు వీడ్కోలు పలకకుండానే బిజినెస్‌మ్యాన్‌గా మారాడు. తన దేశానికే చెందిన స్టార్ క్రికెటర్లు ఫాఫ్ డుప్లెసిస్, జాంటీ రోడ్స్‌తో కలిసి ఓ క్రికెట్ ఫ్రాంచైజీకి ఓనరయ్యాడు. ఈ సౌతాఫ్రికా త్రయం యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లో రోటర్‌డామ్ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్నారు.
ఈ లీగ్ తొలి ఎడిషన్ (ETPL 2026) ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 20 వరకు జరగనుంది. ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ క్రికెట్ బోర్డుల మద్దతుతో ప్రారంభమవుతున్న ఈ లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఆమ్‌స్టర్‌డామ్, బెల్‌ఫాస్ట్, ఎడిన్‌బర్గ్, డబ్లిన్, రోటర్‌డామ్, గ్లాస్గో నగరాలకు ప్రాతినిధ్యం వహించే జట్లు ఈ లీగ్‌లో పోటీపడనున్నాయి.
యజమాని.. కెప్టెన్ కూడా..!
రోటర్‌డామ్ జట్టుకు డుప్లెసిస్ కేవలం సహ యజమాని మాత్రమే కాదు, జట్టు కెప్టెన్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ఫ్రాంచైజీ క్రికెట్‌లో యాజమాన్యం, నాయకత్వం రెండూ ఒకేసారి చేపట్టడం అరుదైన విషయం. అనేక టీ20 లీగ్‌లలో కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసిన డుప్లెసిస్, ఇప్పుడు అదే అనుభవాన్ని తన సొంత జట్టుకు ఉపయోగించనున్నాడు. అయితే సహ యజమానిగా, కెప్టెన్‌గా ఉండటానికి రూల్స్ ఒప్పుకుంటాయో లేదో చూడాలి.
భీకర ఫామ్‌లో క్లాసెన్
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026లో క్లాసెన్ అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్‌ల్లో 59.14 సగటున, 157.41 స్ట్రయిక్‌రేట్‌తో 4 అర్ద సెంచరీల సాయంతో 414 పరుగులు చేసి లీడింగ్ రన్ స్కోరర్ల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. తాజాగా ముంబై ఇండియన్స్‌పై మెరుపు అర్ద శతకం చేసి తన జట్టుకు అపురూప విజయాన్నందించాడు.
జాంటీ రోడ్స్ విషయానికొస్తే.. ఈ దిగ్గజం ప్రస్తుతం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఫీల్డింగ్ కోచ్‌గా ఉన్నాడు. అలాగే పలు టీ20 లీగ్‌ల్లో కోచింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.


