న్యూజిలాండ్‌ను కుప్పకూల్చిన ఇంగ్లండ్‌.. సిరీస్‌ కైవసం | England demolish NZ to clinch T20I series | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ను కుప్పకూల్చిన ఇంగ్లండ్‌.. సిరీస్‌ కైవసం

May 26 2026 4:39 PM | Updated on May 26 2026 4:48 PM

England demolish NZ to clinch T20I series

త్వరలో జరుగబోయే టీ20 వరల్డ్‌కప్‌కు (జూన్‌ 12) ముందు ఇంగ్లండ్‌ మహిళల జట్టుకు మంచి బూస్టప్‌ లభించింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆ జట్టు 2-1 తేడాతో కైవసం చేసుకుంది. హోవ్‌ వేదికగా జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌ను చేజిక్కించుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్‌ చేసి ప్రత్యర్దిని 19.1 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూల్చిన ఇంగ్లండ్‌.. ఆతర్వాత స్వల్ప లక్ష్యాన్ని 13.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించింది.

ఇంగ్లండ్‌ బౌలర్లలో డేనియల్‌ గిబ్సన్‌, కెప్టెన్‌ ఛార్లెట్‌ డీన్‌ తలో 3, లిన్సే స్మిత్‌ 2, ఇస్సీ వాంగ్‌, సోఫీ ఎక్లెస్టోన్‌ చెరో వికెట్‌ తీసి న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ను మట్టుబెట్టారు. న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో 20 పరుగులు చేసిన జెస్‌ కెర్‌ టాప్‌ స్కోరర్‌ కాగా.. ఇసబెల్లా గేజ్‌ (17), మ్యాడీ గ్రీన్‌ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. సూజీ బేట్స్‌ (3), కెప్టెన్‌ అమేలియా కెర్‌ (5), బ్రూక్‌ హ్యాలిడే (2), నెన్సీ పటేల్‌ (2), బ్రీ ఇల్లింగ్‌ (3) సింగిల్‌ డిజిట్‌ స్కోర్లు చేయగా.. సోఫీ డివైన్‌, ఇజ్జీ షార్ప్‌ డకౌట్‌ అయ్యారు.

ఇంగ్లండ్‌ బ్యాటర్లలో సోఫీ డంక్లీ 22, హీథర్‌ నైట్‌ 18, అలైస్‌ క్యాప్సీ 3 పరుగులు చేసి ఔట్‌ కాగా.. మియా బౌచియర్‌ (19 నాటౌట్‌), ఫ్రేయా కెంప్‌ (7 నాటౌట్‌) జట్టును విజయతీరాలకు చేర్చారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో బ్రీ ఇల్లింగ్‌, నెన్సీ పటేల్‌, అమేలియా కెర్‌ తలో వికెట్‌ తీశారు. 

కాగా, ఈ సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన వన్డే సిరీస్‌ 1-1తో డ్రాగా ముగిసింది. తొలి వన్డే ఇంగ్లండ్‌, మూడో వన్డే న్యూజిలాండ్‌ గెలవగా.. రెండో వన్డే డ్రాగా ముగిసింది. ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం న్యూజిలాండ్‌ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement